ఉత్తేజంగా .. ఉత్సాహంగా …

  • సిపిఎం రాష్ట్ర మహాసభలు ప్రారంభం
  • పతాకావిష్కరణ చేసిన పి.మధు
  • జాతా జెండాలను స్వీకరించిన నాయకులు

ప్రజాశక్తి – కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ : అరుణ పతాకాల రెపరెపలు, సంకల్ప నినాదాల హోరు మధ్య సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు శనివారం ఉదయం నెల్లూరులోని కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (అనిల్‌ గార్డెన్స్‌)లో ఉత్తేజకరంగా ప్రారంభమయ్యాయి. మహాసభల వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమర వీరుల స్థూపం వద్ద పార్టీ నాయకులు, రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన ప్రతినిధులు, పరిశీలకులు, ప్రత్యేక ఆహ్వానితులు బారులు తీరి, అరుణ పతాకకు జేజేలు పలికారు. వివిధ ప్రధాన సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఐదు ప్రచార జాతాలు అత్యంత స్ఫూర్తిదాయక వాతావరణంలో సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. ఒక్కో జాతా ఉద్దేశాన్ని, వాటిలో పాల్గొన్న ప్రతినిధులను పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ పరిచయం చేశారు. విశాఖ జిల్లా కూర్మన్నపాలెం నుంచి విశాఖ స్టీల్‌ప్లాంటు పరిరక్షణ జాతా; అల్లూరి జిల్లా కూనవరం నుంచి పోలవరం జాతా; గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి రాజధాని జాతా; నంద్యాల నుంచి సెకి ఒప్పందాల రద్దు జాతా; జమ్మల మడుగు నుంచి కడప ఉక్కు నిర్మాణ జాతా నినాదాలను మార్మోగిస్తూ వచ్చి, ప్రతినిధుల జేజేలను అందుకున్నాయి. ఆయా జాతాల డిమాండ్లతో కూడిన నినాదాలతో సభా ప్రాంగణం ప్రతిధ్వనించింది. ప్రజల ఆకాంక్షలను గైకొని వచ్చిన జాతా జెండాలను పార్టీ నాయకులు ఎంఎం బేబి, బివి రాఘవులు, పి.మధు, ఎంఎ గఫూర్‌, బి.వెంకట్‌ స్వీకరించారు. మహాసభల నేపథ్యం, జాతాలు ప్రజల్లో చేసిన ప్రచారం గురించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వివరించారు.

మహాసభల ప్రారంభ సూచికగా అరుణ పతాకాన్ని పార్టీ సీనియర్‌ నాయకులు, రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు ఆవిష్కరించారు. ఎర్రకాంతులు చిందిస్తూ ఎగిరిన పతాకానికి ప్రతినిధులు రెడ్‌ సెల్యూట్‌ చేశారు. ఈ సందర్భంగా వదిలిన ఎర్ర బెలూన్లు పెద్ద సంఖ్యలో ఆకాశంలోకి ఎగురుతూ, మహాసభల ప్రారంభ సంరంభాన్ని నెల్లూరు నగరం నలుమూలలకూ మోసుకుపోయాయి. పతాకావిష్కరణ సమయంలో విరజిమ్మిన ఎర్రకాంతుల కాగితాలు ప్రాంగణాన్ని, ఎగురుతున్న పతాక నేపథ్యాన్ని అరుణారుణం చేశాయి. సంఘటితతత్వానికి, సమరస్ఫూర్తికి చిహ్నంగా రూపొందించిన అమర వీరుల స్థూపం చూపరులకు ఉత్తేజాన్ని నింపేదిగా ఉంది. దాని వెనుక 27వ మహాసభలకు గుర్తుగా 27 పెద్ద ఎర్రజెండాలను అమర్చారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఎర్రజెండా పాటలతో ఆరంభ సన్నివేశం ఆద్యంతమూ ఉత్సాహకరంగా సాగింది. ‘జెండా .. ఎర్రని జెండా … వీరుల జెండా’, ‘వీరులారా పోరు బిడ్డలారా’, ‘విధానాలు నికరం ఆశయాల శిఖరం’ అంటూ సాగిన గీతాలు అరుణపతాక ఔన్నత్యాన్ని, ఆశయబలాన్ని చాటి చెప్పాయి. కళాకారులు ఉత్తేజకర గీతాలాపన చేస్తుండగా, మహాసభ ప్రతినిధులు వరుసల వారీగా ఒక్కొక్కరు అమర వీరులకు నివాళ్లు అర్పిస్తూ, మహాసభల ప్రాంగణంలోకి అడుగుపెట్టారు.

విశాఖ ఉక్కు జాత కాగడాన్ని అందుకుంటున్న ఎంఎ బేబి
➡️