ఉపాధి పనుల్లోనూ ‘వెలివేత’ – దళిత మహిళ ఆత్మహత్యాయత్నం

Jun 1,2024 08:42 #Discovery, #Employment

ప్రజాశక్తి- శ్రీకాళహస్తి : ఉపాధి హామీ పనుల్లోనూ కులరక్కసి కాటేస్తోంది. తాము చెప్పినట్టు వారికి ఉపాధి పనుల నుండి కూడా వెలివేస్తున్నారు.
దీనిని అడ్డుకోవాల్సిన అధికారయంత్రాంగం చూసీ చూడనట్లు ఊరుకుంటోంది. తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పరమాలపల్లికి చెందిన దళితుడైన బాలరాజుకు గాయకుడిగా, అంబేద్కర్‌ వాదిగా స్థానికంగా గుర్తింపు ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో గ్రామంలో జరిగిన తాంత్రిక పూజలను ఆయన అడ్డుకున్నారు. వాటిని నిర్వహిస్తున్న గ్రామ పెద్దలపై కేసులు పెట్టారు. దీంతో కక్ష కట్టిన స్థానిక పెత్తందారులు బాలరాజు కుటుంబాన్ని గ్రామం నుండి వెలి వేశారు. ఈ క్రమంలో ఊరు బయటే ఉంటూ బాలరాజు న్యాయపోరాటం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం గ్రామంలో ఉపాధి హామీ పరులు ప్రారంభమైనాయి. ఆ పనుల కోసం బాలరాజు భార్య పద్మ వెళ్ళారు. అయితే, స్థానిక పెత్తందారుల ప్రోద్భలంతో ఉపాధి కూలీల్లోనే కొందరు ఆమెకు పని ఇవ్వడానికి వీలులేదని అడ్డుపడ్డారు. గ్రామం విధించిన రూ.లక్ష జరిమానా కట్టడంతోపాటు బహిరంగ క్షమాపణలు చెబితేనే తమతో కలిసి పనిచేసేందుకు ఒప్పుకుంటామని చెప్పారు. దీనికి పద్మ అంగీకరించకపోవడంతో ఉపాధి కూలీలు పనులు మానేసి ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. అప్పటి నుంచి పనులను వాయిదా వేస్తూ వచ్చిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గురువారం తిరిగి ప్రారంభించారు. విషయం తెలుసుకున్న బాలరాజు భార్య పద్మ పనుల కోసం మళ్లీ వెళ్లారు. కూలీలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పద్మ అక్కడే నిద్ర మాత్రలుమింగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న ఆమె భర్త బాలరాజు 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. జిల్లా కలెక్టర్‌, ఎస్‌పి స్పందించి తమకు న్యాయం చేయాలని బాలరాజు కోరారు.

➡️