పింఛన్లపై వేటు

  • ఆరు నెలల్లో 1.60 లక్షల కోత

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లపై ప్రభుత్వం వేటువేస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాజిక పింఛన్లను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, కుడి చేత్తో పెంచి ఎడమ చేత్తో ప్రభుత్వం కోత పెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అనర్హుల ఏరివేత పేరిట ఈ ప్రక్రియ సాగుతోందన్నది ప్రధాన విమర్శ. తాజాగా ‘న్యూస్‌ మినిట్‌’ వెబ్‌సైట్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఆరు నెలల కాలంలో 1.60 లక్షల పింఛన్లపై వేటు పడినట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దేశ వ్యాప్తంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును (పబ్లిక్‌ సర్వీసెస్‌ డెలివరీ విధానం)ను అధ్యయనం చేసే ‘లిబ్‌టెక్‌ ఇండియా’ విడుదల చేసిన గణాంకాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇంజినీర్లు, సామాజిక కార్యకర్తలు కలిసి పింఛన్ల డాటాను క్రమం తప్పకుండా ట్రాక్‌ చేయడం ద్వారా ఈ గణాంకాలను రూపొందించారని తెలిపింది. ఈ కథనం ప్రకారం 2024 జూన్‌ నెలలో రాష్ట్రంలో 65.5 లక్షల సామాజిక పింఛన్లు పంపిణీ అవుతుండగా, డిసెంబర్‌ నెలాఖరుకు ఆ సంఖ్య 63,92,702కు తగ్గింది. అంటే దాదాపుగా 1.60 లక్షల మేరకు పింఛన్లపై కోత పడింది. ఆరు నెలల కాలంలోనే ఈ స్థాయిలో కోత పెట్టడం అనూహ్యమన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అయితే, పింఛన్ల కోత ఒక క్రమ పద్ధతి ప్రకారం జరుగుతోందని, ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల ఉంటోందని ‘లిబ్‌టెక్‌ ఇండియా’ పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పింఛన్లపై టిడిపి కూటమి నాయకులు మొదటి నుండి అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే డిసెంబరు 9, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక సచివాలయాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి క్షేత్రస్ధాయిలో పరిశీలన చేశారు. ఈ సర్వేలో 10,958 మంది పింఛన్‌దారులను పరిశీలిస్తే ఐదు శాతం మందిని అనర్హులుగా సర్వే టీమ్‌లు గుర్తించాయి. దీనినే పేర్కొంటూ రాష్ట్రం మొత్తం మీద 3.2లక్షల మంది అనర్హులు పించన్‌ పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు కొద్దిరోజుల క్రితం అంచనా వేశాయి. వీటి కారణంగా ప్రతి నెలా రూ.120 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పింఛన్ల సంఖ్య తగ్గుతుండటం గమనార్హం.

➡️