డిసెంబరు మొదటి వారంలో నియామకాలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : టిటిడి అనుబంధ విభాగాల్లోని కీలక నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటికే టిటిడి పాలకమండలిని నియమించిన సంగతి తెలిసిందే. అందుకు అనుబంధంగా ఉండే పోస్టులను డిసెంబరు మొదటి వారంలో భర్తీ చేసేందుకు టిడిపి కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసినట్లు సమాచారం. యువత, విద్యావంతులు, ప్రత్యక్షంగా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులకు ముఖ్యంగా శాసనసభలో ప్రాతినిధ్యం లేని కులాలకు పదవుల పంపిణీలో ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. టిటిడి అనుబంధ విభాగాల్లో కీలకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్‌విబిసి) ఛైర్మన్, శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ (ఎస్‌విఇటిఎ) ఛైర్మన్ నియామకం విభాగాలు అత్యంత కీలకమైనవి కావడంతో టిడిపి, జనసేన, బిజెపి నుంచి ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. వీరితోపాటు ఎస్‌విబిసి సిఇఒ, అడ్వైజరు, చీఫ్ అడ్వ్తెజరు పదవుల భర్తీ కోసం కసరత్తు జరుగుతోంది. ఎస్‌విబిసి ఛానెల్‌కు 2018లో అప్పటి టిడిపి ప్రభుత్వం సినీ దర్శకుడు రాఘవేంద్రరావును ఛైర్మన్‌గా నియమించింది. 2019లో వైసిపి అధికారంలోకి రావడంతో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైసిపి ప్రభుత్వం ఆ పోస్టుకు సినీనటుడు పృధ్వీని నియమించింది. పలు వివాదాలు చుట్టుముట్టడంతో ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర ఎస్‌విబిసి ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మూడేళ్లు ఆ పదవిలో కొనసాగిన ఆయన 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ ఛైర్మన్ పదవిని ఆశించే వారి సంఖ్య కూడా బాగానే ఉన్నట్లు తెలిసింది. టిటిడి ఉద్యోగు లకు, అర్చకులకు ఎస్‌విఇటిఎ కేంద్రంగానే శిక్షణ ఇస్తుంటారు. ఆశావహులు పెరుగుతుండటం, గతంలో సినీ ఇండిస్టీ వారికి ఈ పదవి ఇచ్చిన నేపథ్యంలో వారికే ఈ దఫా కూడా పదవులు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.