- ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి బిసి జనార్ధన్‌రెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్రాంతి పండుగ నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా రహదారుల మరమ్మతు పనులను మరింత వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌బి శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి బిసిజనార్ధన్‌రెడ్డి ఆదేశించారు. నిర్దిష్ట కాల వ్యవధిలో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగాలని ఆయన సూచించారు. విజయవాడ ఇఎన్‌సి కార్యాలయం నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద 45,378 కిలో మీటర్లు రాష్ట్ర, జిల్లా ప్రధాన రోడ్లు ఉన్నాయని, అందులో 22,299 కిలో మీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. రూ.861 కోట్లతో 2,648 కిలో మీటర్ల మేర రోడ్లను గుంతల రహిత రహదారులుగా తీర్చి దిద్దడం జరిగిందన్నారు. గత ఐదేళ్లపాటు నరకయాతన చూసిన ప్రజలకకు మెరుగైన రహదారులు కల్పించాలనే లక్ష్యంతో రోడ్ల మరమ్మతులకు సంబంధించిన పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా తీసుకుందన్నారు. కొన్ని జిల్లాల్లో రోడ్ల మరమ్మతుల పనులు వెనుకబడి ఉండటంపై సంబంధిత డివిజన్ అధికారులపై సీరియస్ అయ్యారు. సకాలంలో పనులు పూర్తి కాకపోతే అధికారులపై చర్యలు తీసుకోక తప్పదని మంత్రి హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇఎన్‌సి నయిముల్లా, ఆర్‌అండ్‌బి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.