డబ్బు కోసమే దోపిడీ..

Mar 13,2025 21:40 #Chittoor District, #robbery

– పరారైన దొంగలు పట్టుబడ్డారు : ఎస్‌పి
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌ : చిత్తూరు నగరంలో బుధవారం చోటు చేసుకున్న దోపిడీ కేసులో నిందితులు పుష్ప కిడ్స్‌ షాపింగ్‌ మాల్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంటిలో డబ్బు కోసమే దోపిడీకి పాల్పడారని, ఈ దోపిడీలో డ్రైవర్‌తో కలిపి మొత్తం ఏడుగురు నిందితులు పాల్గొన్నారని చిత్తూరు జిల్లా ఎస్‌పి మణికంఠ చందోలు తెలిపారు. ఘటనా స్థలంలో నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మిగిలిన ముగ్గురు నిందితులను గురువారం సాంకేతిక సమాచారంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి మాట్లాడుతూ.. దోపిడీ ఘటనలో ప్రధాన ముద్దాయి సుబ్రహ్మణ్యం పదిహేను సంవత్సరాల క్రితం చిత్తూరు నగరంలోని రెడ్డిగుంట ప్రాంతంలో ఎస్‌ఎల్‌వి ఫర్నీచర్‌ షాపును నిర్వహించేవాడని, ఆయనపై నంద్యాల, అనంతపురం జిల్లాలో రెండు హత్య కేసులు, నంద్యాలలో ఆరు కేసులు ఉన్నాయని, పది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడని తెలిపారు. చిత్తూరులో ఫర్నీచర్‌ షాపు పెట్టి అప్పులపాలవ్వడంతో డబ్బు కోసం పుష్ప కిడ్స్‌ షాపింగ్‌ మాల్‌ యజమాని చంద్రశేఖర్‌ను ఎంచుకుని బెదిరించి డబ్బులు తీసుకొనేందుకు ప్రయత్నించిన్నట్లు చెప్పారు. సుబ్రమణ్యం, చంద్రశేఖర్‌కు మధ్య పరిచయం కూడా ఉందన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏడుగురిలో సుబ్రహ్మణ్యం తప్పించుకొనే ప్రయత్నంలో తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఆరుగురు ఇబ్రహిం, నవీన్‌ కుమార్‌, రామాజనేయులు, నెట్టి కంఠయ్య, రాజశేఖర్‌, సంపత్‌ కుమార్‌లను మీడియా ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దోపిడీ ఘటనలో సుబ్రహ్మణ్యం స్థానికుడు కాగా, మిగిలిన ఆరుగురు కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాలకు చెందినవారని తెలిపారు. ఈ దోపిడీకి సూత్రధారి సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.

పక్కా ప్రణాళికతోనే…
పక్కా ప్రణాళికతోనే బుధవారం ఉదయం 5.30 గంటకు తమిళనాడు రిజిస్టేషన్‌ వాహనంలో డ్రైవర్‌తో సహా ఏడుగురు ముసుగులు ధరించి చంద్రశేఖర్‌ ఇంట్లో రెండో అంతస్తులోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న చంద్రశేఖర్‌ను వెంట తెచ్చుకున్న నకిలీ తుపాకులు, కత్తులను చూపించి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. ప్రతిఘటించిన చంద్రశేఖర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర్‌ ముఖం, చేతికి గాయాలయ్యాయి. పోలీసులు స్థానికుల సాయంతో సుబ్రహ్మణ్యంను, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న రాజశేఖర్‌, సంపత్‌, నెట్టి కంఠయ్యను గురువారం కాణిపాకం వద్ద అదుపులోకి తీసుకున్నారు.

➡️