- నిర్మలా సీతారామన్‌కు పవన్ కళ్యాణ్ వినతి
- ఢిల్లీ పర్యటనలో మంత్రులతో వరుస భేటీలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి పథకాలకు రుణ వెసులుబాటును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల పథకం (ఎపిఆర్‌ఆర్‌పి) కోసం నిర్దేశించిన గడువు ఈ ఏడాది డిసెంబరు 31తో ముగియనుందని, అయితే పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవని గడువు పొడిగించాలని ఆర్థిక మంత్రిని పవన్ కోరారు. ఇందుకోసం ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి పెట్టుబడుల బ్యాంకు (ఎఐఐబి) నుంచి తీసుకొన్న రుణ పథకాన్ని 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని విన్నవించారు. రుణ చెల్లింపు విషయంలో ఒప్పందంలో పేర్కొన్న రీయింబర్స్‌మెంటు పద్ధతి కాకుండా కేంద్రమే ముందు చెల్లించే విధంగా చూడాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 70 శాతం (ఎఐఐబి) : 30 శాతంం పన్నులు (ఏపి ప్రభుత్వం) విధానం నుంచి 90 శాతం (ఎఐఐబి) :10 శాతం (ఏపి ప్రభుత్వం)గా మార్పు చేయాలని కోరారు. 455 మిలియన్ యుఎస్ డాలర్ల (రూ. 3834.52 కోట్లు) బ్యాంక్ అంగీకారం మేరకు వాటాను కొనసాగిస్తూ నిధుల విడుదల మార్పును పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఆర్థిక మంత్రితో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. ఆయా శాఖల అభివృద్ధి పథకాలను వివరించి, వాటి కోసం సహకారం కోరారు.
సామర్లకోట – ఉప్పాడ రహదారిపై రైల్వే ఓవర్ బ్రిడ్జి
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఒబి) నిర్మాణం అవసరం ఉందని, దీన్ని సత్వరమే మంజూరు చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ని పవన్ విజ్ఞప్తి చేశారు. అదే విధంగా శ్రీపాద వల్లభ స్వామి ఆలయానికి వచ్చే యాత్రికుల కోసం నాలుగు ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ మంజూరు చేయాలన్నారు. నాందేడ్ – సంబల్పూర్ నాగావళి ఎక్స్ ప్రెస్, నాందేడ్ – విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, విశాఖ పట్నం- సాయి నగర్ షిర్డీ ఎక్స్ ప్రెస్, ఏపీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం – న్యూఢిల్లీ)కి పిఠాపురంలో హాల్ట్ అవసరమని కోరారు. లాతూరు నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని కోరారు.
గ్రామాల్లో తాగునీటికి కేంద్రం సాయం
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు వీలుగా చేపట్టే కార్యక్రమాలకు కేంద్రం తగినన్ని నిధులు సమకూర్చి సహకారం అందించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని పవన్ కళ్యాణ్ కోరారు. 2019-2024 మధ్య జల జీవన్ మిషన్ (జెజెఎం) కింద అందించిన కనెక్షన్లలో కుళాయిల సామర్ధ్యం, నీటి నాణ్యత అంశంలో ఇటీవల చేసిన సర్వేతో పలు సమస్యలను గుర్తించామని పేర్కొన్నారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం 29.79 లక్షల కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్లు అందలేదని, అలాగే 2.27 లక్షల పంపులు పని చేయడం లేదని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి వ్యక్తికి రోజుకు కనీసం 55 లీటర్లు సురక్షితమైన మంచి నీరు అందించడం లక్ష్యంగా ఉన్నా..ఇంకా ఆ లక్ష్యానికి దూరంగా ఉన్నామని పవన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో మంచినీరు అందించేందుకు కేంద్రం సహకారం అందించాలని కోరారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సిసి రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పవన్ కళ్యాణ్ కోరారు. వాటర్ షెడ్ పథకానికి రాష్ట్ర వాటా నిధులను తగ్గించి 90 : 10 దామాషా ప్రకారం నిధుల కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని గుర్తిస్తే, దానిలో పిఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్లు నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందని అన్నారు. 2,230 గ్రామాలకు ఇంకా అనుసంధాన రోడ్లు వేయాల్సి ఉందని అన్నారు. పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్‌ను టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృధ్ధికి కేంద్ర సహకారాన్ని కోరారు.
సౌర విద్యుత్ టెండర్ల అవినీతిపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం : పవన్ కళ్యాణ్
కేంద్ర మంత్రులతో వరుస భేటీల అనంతరం పవన్ కళ్యాణ్ స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సౌర విద్యుత్ టెండర్ల అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో సమోసలకే రూ.9 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారో అర్థం అవుతుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలన్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్న విషయంపై అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ ‘ఉపముఖ్యమంత్రిగా నా పని నేను చేసుకుపోతున్నా..పోలీసులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. శాంతిభద్రతలు హోంమంత్రి చూస్తారు. ఆ పని నేను చేయడం లేదు’ అని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు ఇబ్బందిపెట్టిన సమయంలో ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారో అనే విషయాన్ని ముఖ్యమంత్రిని అడుగుతానని చెప్పారు. దీనిపై ఢిల్లీలో మీడియా వాళ్లు అడిగారని కూడా చెబుతా అని పవన్ అన్నారు.