అత్యాధునిక వైద్యంపై విస్తృత పరిశోధనలు

  • అనస్తీషియా వైద్యుల సెమినార్‌లో వక్తలు

ప్రజాశక్తి – తిరుపతి : అత్యాధునిక వైద్యాన్ని అందించే దిశగా అనస్తీషియా విభాగంలో మరిన్ని పరిశోధనలు అవసరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అనస్తీషియా వైద్యుల 33వ వార్షిక సదస్సును తిరుపతిలోని శ్రీ కన్వెన్షన్‌ సెంటర్‌లో శనివారం ప్రారంభించారు. ఈ సదస్సుకు అనస్తీషియా వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఉప్పువేటి తారక ప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సిమ్స్‌ డైరెక్టర్‌ ఆర్‌వి కుమార్‌ మాట్లాడుతూ… వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఆ దిశగా మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యరంగంలో అనస్తీషియా డాక్టర్లది ప్రధానమైన భూమిక అని ఉద్ఘాటించారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా యువ వైద్యులు కృషి చేయాలని కోరారు. ఈ సదస్సుకు గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా నేషనల్‌ అకాడమిక్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం వి భీమేశ్వర్‌ హాజరై.. అనస్తీషియా వైద్యుల విశిష్టతను వివరించారు. పలు కీలక అంశాలపై ప్రసంగించారు. పలు అంశాలపై సైంటిఫిక్‌ సెషన్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ప్యానల్‌ డిస్కషన్లు నిర్వహించారు. ఈ సదస్సుకు తొమ్మిది మంది ఐఎస్‌ఎ నేషనల్‌ పాస్ట్‌ ప్రెసిడెంట్స్‌, ఎనిమిది మంది స్టేట్‌ పాస్ట్‌ ప్రెసిడెంట్‌తో పాటు 1000 మందికి పైగా అనస్తీషియా వైద్యులు హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రముఖ వైద్యులు తోట ఫనీంద్రనాథ్‌, మణికంఠ, రాధా, ప్రదీప్‌ కుమార్‌, సూరిశెట్టి శ్రీనివాస్‌, చక్రరావు తదితరులు పాల్గొన్నారు.

➡️