అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలు అమలు

Mar 31,2024 13:13 #ap congress, #Kadapa, #manifesto, #Schemes

పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి

ప్రజాశక్తి – వేంపల్లె : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటకలో 5 గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పారు. అదేవిధంగా 9 గ్యారెంటీ పథకాలతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడ కాంగ్రెస్ అధికారం లోకి రాబోతుందని తులసిరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం క్రింద ప్రతి పేద కుటుంబం లో ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతు పెట్టుబడి మీద 50 శాతం లాభంతో కనీస మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు. అలాగే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని తెలిపారు. ఇల్లు లేనివారికి రు 5 లక్షలతో ఇల్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ 4 వేలు, వికలాంగులకు నెలకు రూ 6 వేలు పెన్షన్ అందిస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం క్రింద కనీస కూలి రోజుకు రూ 400 వచ్చే విధంగా చర్యలు తీసుకొంటామని చెప్పారు. 2 లక్షల 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల ను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను తీర్చడం జరిగుతుందని తెలిపారు. కాంగ్రెసు పార్టీ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారం లోకి రావాలని కాబట్టి ప్రతి ఒక్కరూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసిరెడ్డి ప్రజలను కోరారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని కోరారు.

➡️