ప్రతినిధుల విశ్లేషణ
ప్రజాశక్తి – కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ : సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలకు అన్ని తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తూ వివిధ రంగాల నుంచి 472 మంది హాజరయ్యారు. ఇందులో 463 మంది (పురుషులు 375 మంది, మహిళలు 88 మంది) ఇచ్చిన వివరాల ఆధారంగా మహాసభల అర్హతల కమిటీ విశ్లేషణ చేసింది. ఇందులో ప్రతినిధులు 362 మంది కాగా, పరిశీలకులు 101 మంది. సభకు హాజరైన ప్రతినిధుల్లో అత్యధికులు వివిధ ప్రజాపోరాటాల్లో పాల్గొని, అరెస్టులను ఎదుర్కొన్నవారు కావటం సిపిఎం సమరశీల ఉద్యమాలకు అద్దం పడుతోంది. ప్రతినిధుల్లో 73 శాతం మంది అంటే దాదాపు మూడొంతుల మంది (337) వివిధ ప్రజా ఉద్యమాల సందర్భంగా అరెస్టయి, పోలీసు కేసులకు ఎదుర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మూలం రమేష్ అత్యధికంగా ఐదు సంవత్సరాల ఆరు నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. వి.ఉమా మహేశ్వరరావు (రాష్ట్ర కేంద్రం), ఎం.జీవరత్నం (ఏలూరు) ఆరేసి నెలల పాటు జైల్లో ఉన్నారు. సిహెచ్.నర్సింగరావు 10 నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ప్రజా ఉద్యమాల్లో పాల్గొని అత్యధిక కేసులు (36) ఎదుర్కొన్న వారిలో దోనేపూడి కాశీనాధ్ ఉన్నారు. హాజరైన ప్రతినిధుల్లో 360 మంది అంటే 76 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బిసి తరగతుల నుంచి ఉన్నారు. మొత్తం ప్రతినిధుల్లో 200 మంది అంటే 43 శాతం మంది 50 ఏళ్ల లోపు వారు ఉన్నారు. ప్రతినిధుల సగటు వయసు 51.9 ఏళ్లుగా ఉంది. హాజరైన వారిలో 25 ఏళ్ల లోపు వయసు వారు ఇద్దరున్నారు. వారు ఎన్టీఆర్ జిల్లా నుంచి సిహెచ్.వెంకటేశ్వరరావు, అనంతపురం నుంచి సి.సుగుణ. అత్యధిక వయస్కులు వై.కేశవరావు (84 ఏళ్లు).
సరళీకరణ విధానాలు ప్రారంభమైన 1991 తరువాత పార్టీలో చేరిన వారిలో 318 మంది – ఈ సభలకు ప్రతినిధులకు వచ్చారు. ఇందులో 1991 – 2000 మధ్య చేరినవారు 167 మంది కాగా, 2001 -10 మధ్య చేరినవారు 103 మంది, 2011 – 25 మధ్య చేరిన వారు 48 మందీ ఉన్నారు. రంగాల వారీగా చూస్తే – కార్మికరంగం నుంచి 152 మంది, వ్యవసాయ కార్మిక 42, రైతు 23, కౌలురైతు 12, మహిళ 30, యువజన ఏడుగురు, విద్యార్థి ఆరుగురు, గిరిజన 24, సామాజిక రంగం నుంచి 10 మందీ హాజరయ్యారు. వివిధ సామాజిక తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్సీల నుంచి 87 మంది, ఎస్టీల నుంచి 39 మంది, వెనుకబడిన తరగతుల నుంచి 197 మంది సభల్లో పాల్గొన్నారు. క్రిష్టియన్, ముస్లిం తరగతుల నుంచి 37 మంది హాజరయ్యారు. ప్రతినిధుల్లో ఆరుగురు నిరక్షరాస్యులు కాగా, సగానికి పైగా (267 మంది) ఉన్నత విద్యావంతులు. టెన్త్, ఇంటర్మీడియట్ చదివినవారు 173 మంది ఉన్నారు.