సచివాలయ సిబ్బందితో కుటుంబ సర్వే

  • ప్రతి ఇంటికీ జియో ట్యాగింగ్‌ తప్పనిసరి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీర్ల ద్వారా హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ చేయగా, తాజాగా కూటమి ప్రభుత్వం ఏకంగా ఆయా ఇళ్లను జియో మ్యాపింగ్‌ చేయడంతో పాటు కుటుంబంలోని వారి వివరాలను కూడా సర్వే ఆధారంగా డేటా బేస్‌ నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. నవంబరు 31న దీపావళి రోజున జరిగిన సిఎం సమీక్షలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు మంగళవారం జిఎస్‌డబ్ల్యుఎస్‌ శాఖ డైరెక్టర్‌ శివప్రసాద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటింటి సర్వే ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పటి లోగా పూర్తి చేయాలనే అంశాలు ఉత్తర్వుల్లో లేకపోయినప్పటికీ భవిష్యత్తులో సంక్షేమ పథకాల మంజూరు, తొలగింపుపై ఈ సర్వే ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. జనవరి నుంచి కొత్త రేషన్‌ కార్డులు, నూతన పెన్షన్లు, పిఎంఎవై 2.0 గృహాల మంజూరు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అర్హులైన నిరుద్యోగుల జాబితాను ఎంపిక చేయడం, నిరుద్యోగ భృతికి అర్హులను గుర్తించడంతో పాటు పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా చేపట్టనున్న కుటుంబ సర్వే వల్ల కొంతమేర సంక్షేమ పథకాల లబ్ధిదారులు తగ్గే అవకాశం కూడా లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రేషన్‌ కార్డులను విడగొట్టి తాజాగా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. నిజంగా కుటుంబాలు వేర్వేరుగా నివాసం ఉంటున్నారా? లేక ఉమ్మడిగా ఉంటూ సంక్షేమ పథకాల కోసం కార్డులను విడగొట్టాలని దరఖాస్తులు చేసుకుంటున్నారా అనే విషయం ఈ సర్వేతో తేటతెల్లమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సర్వే అని అనగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొంత మేర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

➡️