అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Jun 11,2024 22:40 #commits suicide, #debt, #Farmer

ప్రజాశక్తి- మాచర్ల (పల్నాడు జిల్లా):అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పల్నాడు జిల్లా వెల్ధుర్తి మండలంలో మంగళవారం వెలుగు చూసింది. మృతుని కుటుంబసభ్యుల కథనం ప్రకారం… మండలంలోని రచ్చమాలపాడుకు చెందిన ఐతంరాజు వెంకటేశ్వర్లు (49)కు మూడెకరాల సొంత పొలం ఉంది. మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి సాగు చేస్తుండడంతోపాటు గ్రామంలోనే ఎరువులు, పురుగుమందులు వ్యాపారం చేస్తున్నారు దీంతోపాటు రైతులకు మందులను అప్పుగా ఇచ్చి ప్రతిగా పంటలను కొంటుండారు. ఈ క్రమంలో వ్యవసాయంతోపాటు వ్యాపారంలోనూ నష్టాలు రావడంతో సుమారు రూ.40 లక్షల వరకూ అప్పులపాలయ్యారు. అప్పులిచ్చిన వారు వీటిని తీర్చాలని ఒత్తిడి చేస్తుండంతో తీవ్ర మనస్తాపానికి గురై మాచర్ల వెళ్లి పురుగుల మందు కొని తిరిగి ఇంటికి వచ్చే మార్గం మధ్యలో మండాది బ్రహ్మంగారి గుడి వద్ద దానిని తాగి పడిపోయారు. రాత్రయినా వెంకటేశ్వర్లు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుకులాట ప్రారంభించారు. గుడిపక్కన వెంకటేశ్వర్లు మృతి చెంది పడి ఉండడాన్ని స్థానికులు చూసి కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు మంగళవారం తరలించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తెకు వివాహమైంది. మిగతా వారు చదువుతున్నారు.

➡️