విద్యుదాఘాతంతో రైతు మృతి

ప్రజాశక్తి-రామభద్రపురం (విజయనగరం జిల్లా) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని కొండపాలవలస గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాడంగి మండలం గజరాయుని వలస గ్రామానికి చెందిన నల్ల అప్పలనాయుడు (58), తన భార్య సరోజినితో కలిసి కొండపాలవలస పరిధిలో ఉన్న తమ పొలంలో పురుగుల మందు చల్లేందుకు వెళ్లారు. మందు చల్లడం పూర్తయ్యాక అప్పలనాయుడు చేతులు శుభ్రం చేసుకోవడానికి బోరు మోటారు స్విచ్‌ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన భార్య వెళ్లి చూడగా అప్పటికే అప్పలనాయుడు మరణించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సిహెచ్‌సికి తరలించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, అందులో ఒకరికి వివాహమైంది. సరోజిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామభద్రపురం ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.

➡️