బల్మూర్ (నాగర్ కర్నూల్) : నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ‘మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు’ అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ … గ్రామస్తులు పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన ఉధృతం చేశారు. గ్రామంలోనికి పోలీసులను రానీయకుండా ముళ్లకంచెలు వేశారు. మైలారం గ్రామస్తులు చేపట్టిన ఈ ఆందోళనకు మద్దతు తెలపడానికి హైదరాబాద్ నుండి బయలుదేరి వచ్చిన పౌరహక్కుల నేతలు ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్ లను కూడా పోలీసులు వెల్దండ వద్ద అడ్డగించి అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.
