- అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, మద్దతు ధరతో పంటలన్నింటినీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి చేపట్టిన రైతుల పాదయాత్ర సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో సిఐటియు నాయకులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, ప్రకాష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి, ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మిరప, పత్తి, పప్పుశనగ, సీడ్ జొన్న పంటలకు గిట్టుబాటు ధరలేకపోవడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు వి.రామిరెడ్డి మాట్లాడుతూ.. పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారకరమన్నారు. అనంతరం కలెక్టర్ వి.వినోద్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు వి.శివారెడ్డి, విరుపాక్షి, మధుసూదన్ నాయుడు, రాజారామ్ రెడ్డి, బిహెచ్.రాయుడు, రైతులు పాల్గొన్నారు.