- ‘అనంత ఉద్యానవన సమ్మేళనం’లో మంత్రి పయ్యావుల కేశవ్
ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : ఉద్యానవన రైతులను, కంపెనీలను అనుసంధానం చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అనంతపురం నగరంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో ‘అనంత ఉద్యానవన సమ్మేళనం’ కార్యక్రమం జరిగింది. ఉద్యానవన రైతులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. కలెక్టర్ వి.వినోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డ్రిప్ కంపెనీ, కోల్డ్ చైన్ తయారీ కంపెనీలతో పాటు మొత్తం ఆరు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. రైతులకు డ్రిప్ పరికరాలు అందజేత, కోల్డ్ స్టోరేజీకి అవసరమైన సదుపాయాలు, అరటి నుంచి ఫ్యాబ్రిక్ వస్తువుల తయారీ, అరటిపండ్ల ఎగుమతి, ఉద్యానవన పంటలకు సాంకేతిక పరిజ్ఞానం అందించేలా కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్థిక మంత్రి మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో రాష్ట్రంలో డ్రిప్ సిస్టమ్ అమలు చేసే సమయంలో ప్రతిపక్షాలు హేళన చేశాయని, ఇప్పుడు డ్రిప్ పద్ధతి లేని వ్యవసాయాన్ని అనంతపురం జిల్లాలో ఊహించలేమని చెప్పారు. రాబోయే రోజుల్లోనూ రైతులను కంపెనీలకు అనుసంధానం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వచ్చే నెలలో అనంతపురంలోనే కంపెనీలతో అతి పెద్ద సమ్మేళనాన్ని నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎగుమతులకు అవసరమైన విధంగా పంటలు పండించేందుకు కంపెనీలు సహకారం అందిస్తాయని చెప్పారు. అంతకుముందు వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి టిజి.భరత్ ఆన్‌లైన్‌లో పాల్గొని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విప్ కాలవ శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్, హార్టికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఉమ్మడి అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.