రైతులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకురావద్దు

  • ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
  • నిబంధనలను సడలించి ఆదుకోవాలి : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- కోవూరు (నెల్లూరు జిల్లా) : కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ధాన్యం గింజా కొంటామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిన మాటలకు, ఆచరణకు పొంతన లేకుండా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలను సడలించి రైతులను ఆదుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లా కోవూరులోని పడుగుపాడు సహకార పరపతి సంఘంలో సోమవారం ఆయన రైతులతోనూ, సొసైటీ ఇన్‌ఛార్జితోనూ ఆయన ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా అవి రైతులకు ఏ మాత్రమూ ఉపయోగపడడం లేదన్నారు. దీంతో, ప్రయివేట్‌ వారికి ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. మిల్లర్లు కుంటిసాకులు చెప్పి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం పుట్టి (850 కిలోలు) ధాన్యానికి రూ.19,720 చెల్లించాల్సి ఉందని తెలిపారు. మిల్లర్లకు రూ.17 వేలకే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. దీంతో, రైతులు పుట్టి ఒక్కంటికీ రూ.2,700 చొప్పున నష్టపోతున్నారని తెలిపారు. ఎకరాకు పది వేల రూపాయలకుపైగా నష్టపోవాల్సి వస్తోందని వివరించారు. మార్క్‌ెవెన్షన్‌ స్కీమ్‌ కింద రాష్ట్ర బడ్జెట్లో రూ.300 కోట్ల మాత్రమే కేటాయించడం శోచనీయమన్నారు. ఆ మొత్తం ఏ మూలకూ చాలదని తెలిపారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అనేక కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు సేవా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️