ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నేడు, రేపు ధర్నాలు
– ఎపి రైతు, కౌలు రైతు సంఘాలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా రాజీపడేది లేదని, తేమ శాతం 25 శాతం ఉన్నా ప్రతి గింజ కొంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని ఎపి రైతు, ఎపి కౌలు రైతు సంఘం విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి, ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై రాధాకృష్ణ, ఎం హరిబాబు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. తుపాను ప్రభావంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టే అవకాశం లేక అమ్మేందుకు సిద్ధపడితే తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉందని కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రభుత్వ సిబ్బంది… రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 2, 3 తేదీల్లో గ్రామ, మండల కేంద్రాల్లో రైతులు, కౌలు రైతులు ముందుకొచ్చి ధర్నాలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాలనివారు కోరారు.