రైతుల గోడు ఆలకించాలి

  • ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇవ్వాలి
  • సంఘీభావం తెలిపిన వి కృష్ణయ్య,కె ప్రభాకర్‌రెడ్డి

ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : అమరావతి బ్యూరోమంటల్లో దగ్ధమైన పసుపు పంటకు నష్టపరి హారం కోసం రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, దీనిపై సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ఆదుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల కేంద్రంలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం వాటిల్లడంతో అందులో పసుపు పంటను దాచుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలని కోరుతూ బాధిత రైతులు చేపట్టిన రిలేదీక్షలు సోమవారంనాటికి నాలుగో రోజుకు చేరాయి. శిబిరాన్ని సందర్శించిన రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్య, ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాయని గుర్తు చేశారు. బీమా ప్రీమియంతో సంబంధం లేకుండా రైతులకు ప్రస్తుత ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రమాదం జరిగి 45 రోజులైనా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రమాద కారణాలను విచారణ చేసి కోల్ట్‌ స్టోరేజీ యజమానిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జొన్న శివశంకర్‌ మాట్లా డుతూ ప్రభుత్వం, అధికారుల తీరు ఇదేవిధంగా కొనసాగితే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, పరిహారం దక్కే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. ఘటనపై బీమా కంపెనీ రూపొందించిన నివేదికను వెల్లడించాలని కోరారు. వ్యకాస జిల్లా కార్యదర్శి ఇ అప్పారావు మాట్లాడుతూ రైతుల పోరాటంలో తమ సంఘమూ ప్రత్యక్షంగా పాల్గొం టుందని తెలిపారు. కార్యక్రమంలో పసుపు రైతు బాధిత కమిటీ కన్వీనర్‌ వి వెంకటరామయ్య, నాయ కులు ఎం శివసాంబిరెడ్డి, జె బాలరాజు, వై బ్రహ్మే శ్వరరావు, రమేష్‌, చంద్రశేఖర్‌, సురేంద్ర, పుల్లయ్య, నాగయ్య పాల్గొన్నారు.

రూ.8 వేల నష్టపరిహారం: సిఎస్‌కు ఎపి రైతు సంఘం విజ్ఞప్తి

అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన పసువు రైతులను విపత్తు సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు కోరారు. కృష్ణ్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ఆధ్వ ర్యాన ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి సోమవారం సిఎస్‌ను కలిసి ఈ అంశంపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెల 19వ తేదీన గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరీ కోల్డ్‌ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కృష్ణా, గుంటూరు, బాపట్ల, కడప జిల్లాలకు చెందిన 381 మంది రైతులకు చెందిన లక్షా అయిదువేల పసువు బస్తాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని, గోడౌన్‌ యజమాని పూర్తిస్థాయిలో ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని ఇన్సూరెన్స్‌ కంపెనీకి చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. గోడౌన్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల రైతులకు క్వింటాల్‌కు నాలుగు వేల రూపాయల నుంచి ఐదువేల రూపాయలు మాత్రమే నష్టపరిహారం వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పసుపు క్వింటాల్‌ ధర రూ.13 వేలు ఉందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు క్వింటాల్‌కు కనీసం రూ.8 వేలను అదనంగా ఇవ్వాలని సిఎస్‌కు కోరినట్లు వివరించారు. వినతిపై స్పందించిన సిఎస్‌, గుంటూరు జిల్లా కలెక్టరుతో విచారణ జరిపించి, రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనరు జె శివశంకర్‌, రైతు నాయకులు కె శివరామకృష్ణయ్య, పసుపు రైతుల పోరాట కమిటీ నాయకులు వి వెంకటరామయ్య, ఎం శివసాంబిరెడ్డి, చంద్రశేఖర్‌, ఎం ప్రదీప్‌రెడ్డి ఉన్నారు.

➡️