నెల్లూరులో ఘోర ప్రమాదం – ఏడుగురు దుర్మరణం

– 25 మందికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి- కావలి రూరల్‌ :నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని మరో లారీ ఢకొీట్టి డివైడర్‌ దాటి…ఎదురుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్‌ బస్సును ఢకొీనడంతో ఏడుగురు మరణించారు. 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కావలి రూరల్‌ మండలం, ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు వైపు వెళ్తున్న పశువుల లారీని ఐరన్‌లోడ్‌ లారీ వెనుక నుంచి ఢకొీట్టింది. దీంతో పశువుల లారీ బోల్తా కొట్టింది. ఐరన్‌ లారీ డివైడర్‌ దాటి… హైదరాబాదు వైపు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్‌ బస్సును ఢ కొట్టింది. చిమ్మచీకటిలో గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అని తెలుసుకునేలోపు బస్సులో హాహాకారాలు మిన్నంటాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవ్వడంతో బయటకు రాలేక క్షతగాత్రులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైవే మొబైల్‌ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రయాణికులను అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను నెల్లూరుకు తరలించారు. ఘటనాస్థలంలో ఐదుగురు మరణించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. వాహనాలు రోడ్డుకు అడ్డుగా పడిపోవడంతో సుమారు మూడు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బస్సులో సుమారు 50 మంది ఉన్నారు.

మృతుల వివరాలు

రంగారెడ్డి జిల్లా సరూర్‌ నగర్‌ డాక్టర్స్‌ కాలనీకి చెందిన పాలిసెట్‌ దీపక్‌, నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన తొట్టి వేణు, తమిళనాడుకు చెందిన మునిస్వామి తమిళరు, కృష్ణాజిల్లా నాగాయలంక మండలం యేసుపురంకు చెందిన కొప్పాటి తంబిస్వామి, హైదరాబాద్‌ ఆక్తాపూర్‌కి చెందిన అటల్‌రూప, నర్సాపురానికి చెందిన అంజూరి సురేష్‌ అక్కడికక్కడే మరణించారు.మరొకరి వివరాలు తెలియరాలేదు. మృతదేహాలకు కావలి ఏరియా వైద్యశాలలో శవ పరీక్షలు నిర్వహించినట్లు కావలి డిఎస్‌పి వెంకట రమణ తెలిపారు. మృతుల్లో బస్సు డ్రైవర్‌, క్లీనర్‌, ముగ్గురు ప్రయాణికులు, పశువుల లారీ డ్రైవర్‌, ఐరన్‌ లారీ డ్రైవర్‌ ఉన్నారు.

 

 

 

➡️