చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం

  • చిరు వ్యాపారుల మీదికి దూసుకెళ్లిన సిమెంట్‌ లారీ
  • నలుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు స్టేజీ వద్ద సిమెంట్‌ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చిరు వ్యాపారుల మీదికి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఒకరు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేసుకుని క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై పలువురు కూరగాయల వ్యాపారం సాగిస్తుంటారు. సోమవారం సాయంత్రం కూడా కూరగాయల వ్యాపారం కొనసాగింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి వస్తున్న సిమెంట్‌ లారీ అతి వేగంగా వచ్చి ఆలూరు గేటు వద్దకు రాగానే అదుపు తప్పి కూరగాయలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా లారీ దూసుకురావడంతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. వ్యాపారులపై నుంచి వెళ్లిన లారీ అంతే వేగంగా చెట్టును ఢకొీట్టడంతో చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఆలూరు గ్రామానికి చెందిన నక్కలపల్లి రాములు(45), విద్యార్థి దమరగిద్ద కృష్ణ(25), ఇంద్రారెడ్డినగర్‌కు చెందిన సుజాత (38) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరొకరు మృతిచెందారు. ఇతని వివరాలు తెలియాల్సి ఉంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై బీభత్స వాతావరణం నెలకొంది. స్థానికులు క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించారు.

బాధిత కుటుంబాలకు నేతల పరామర్శ
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను, క్షతగ్రాతులను పలువురు నాయకులు పరామర్శించారు. ప్రభుత్వ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పామేన భీంభరత్‌, రాష్ట్ర పొల్యూషన్‌ కరట్రోల్‌ బోర్డు సభ్యులు చింపుల సత్యనారాయణరెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తామన్నారు. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు. సిఎంతో చర్చించి త్వరలో రోడ్డు పనులను ప్రారంభించేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మృతులంతా రైతులు కావడం బాధాకరం అన్నారు.

➡️