- మృతుల్లో భార్యాభర్తలు
- కుమారుడి మరణ వార్త తెలిసి గుండెపోటుతో తల్లి మృతి
ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం), కంకిపాడు (కృష్ణా జిల్లా) : రాష్ట్రంలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో భార్యభర్తలు ఉన్నారు. కుమారుడి మరణ వార్త తెలిసి ఓ తల్లి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం… విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా శ్రీకాకుళం పట్టణానికి చెందిన వారు. వడ్డే అభినవ్ (27), మణిమాల (24) దంపతులు. విశాఖపట్నంలో మణిమాల శనివారం ఐబిపిఎస్ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. అభినవ్‌కు శ్రీకాకుళం పట్టణానికి చెందిన గవిడి కౌశిక్ (27) స్నేహితుడు. కౌశిక్ తన మేనమామ అమెరికా నుంచి వస్తుండడంతో ఆయనను తీసుకొచ్చేందుకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. విశాఖపట్నం వెళ్లేందుకు అభినవ్, మణిమాల దంపతులు కూడా ఈ కారు ఎక్కారు. పోలిపల్లి వద్ద కారు టైర్ పేలడంతో అదుపు తప్పి పల్టీ కొట్టింది. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే మార్గంలో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢకొీంది. దీంతో, ఈ ముగ్గురితోపాటు కారు డ్రైవర్ జయేష్ (20) కూడా అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. పోలీసలు ఘటనా స్థలానికి చేరుకొని కారులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అభినవ్, మణిమాల దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కౌశిక్‌కు ఏడాది క్రితం వివాహం జరిగింది. జయేష్ చిన్నప్పుడే తండ్రి మరణించడంతో తల్లి టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో కౌశిక్ బంగారం షాపు, అభినవ్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు వద్ద చేపల వ్యాన్‌ను కారు ఢకొీనడంతో ముగ్గురు మరణించారు. మృతుల్లో మచిలీపట్నం బలరాంపేటకు చెందిన చీలి ప్రభు (30), చీలి భానుప్రకాశ్ (26), చింత రవి (36) ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో డివైడర్‌ను దాటుకుని వెళ్లి చేపల వ్యాన్‌ను ఢకొీట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు నుజ్జునుజ్జు అయింది. చేపల వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వ్యాన్‌లో ఇరుక్కుపోయిన ఆయనను క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, భానుప్రకాశ్ మృతి వార్త తెలుసుకున్న ఆయన తల్లి సుధారాణి గుండెపోటుతో మరణించారు.