ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్ : పండగపూట విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన నర్సిపురం-మరిపివలస మధ్య రహదారిపై గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియ్యమ్మవలస మండలం అల్లువాడకు చెందిన లోలుగు రాంబాబు 108 వాహనంలో అత్యవసర వైద్య సహాయకుడిగా పనిచేస్తున్నారు. రామభద్రపురం మండల కేంద్రంలో నివాసముంటూ బాడంగిలో విధులు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగకు తన సొంతూరైన అల్లువాడకు తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి వెళ్లారు. పండుగ అనంతరం రామభద్రపురానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. పార్వతీపురం మండలం నర్సిపురం దాటిన తర్వాత అధిక లోడుతో వెళ్తున్న లారీ రాంబాబు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓవర్‌టేక్ చేస్తూ ఢీ కొంది. ఈ ప్రమాదంలో రాంబాబు (42), ఆయన కుమారుడు మోక్షిత్ (6) లారీ చక్రాల కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాంబాబు భార్య, చిన్న కుమాడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ సిఐ గోవిందరావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
