ఆర్‌డిటికి ఎఫ్‌సిఆర్‌ఎ అనుమతులు ఇవ్వాలి

  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో తీర్మానం

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : రాయలసీమ జిల్లాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి సంక్షేమాభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌డిటి) సేవలు నిలిచిపోకుండా రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించి కేంద్రంలో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ఆర్‌డిటి సేవలకు అడ్డంకిగా నిధులు ఆపడాన్ని నిరసిస్తూ ‘ఆర్‌డిటి సేవలు- ఆటంకాలు’ అనే అంశంపై అనంతపురంలోని పెన్షనర్స్‌ భవన్‌లో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎం.కృష్ణమూర్తి, ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు దూరంగా ఉన్న దళిత, గిరిజన, బడుగుల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ఏర్పడిందని తెలిపారు. జిల్లాలో సెమి గవర్నమెంట్‌ లాగా ఆర్‌డిటి సేవలు 3244 గ్రామాల నుండి 3896 గ్రామాలకు, 4,51,200 కుటుంబాలకు విస్తరించాయని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం సేవా సంస్థలపై దాడిని పెంచిందన్నారు. ఎఫ్‌సిఆర్‌ఎ చట్ట సవరణను తెచ్చి ఆర్‌డిటికి వస్తున్న నిధులకు ఆంక్షలు విధించిందని తెలిపారు. మత ప్రచారాలు, మత మార్పిడులు చేస్తోందని తప్పుడు ప్రచారం చేసి పేదలకు అందిస్తున్న సేవలను దూరం చేస్తోందన్నారు. తక్షమే ఆర్‌డిటికి ఎఫ్‌సిఆర్‌ఎ రెన్యువల్‌ చేయాలని, సంస్థకు నిధుల సమస్య తీరేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై ఎంపిలు, ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరారు. అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఆర్‌డిటిని రక్షించుకునేందుకు ముందుకు వెళ్లాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో రిటైర్డు డిప్యూటీ కలెక్టర్‌ డి.గోవిందరాజులు, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం.బాషా, ఎస్‌సి, ఎస్‌టి జెఎసి రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటి సభ్యులు నెరమెట్ల ఎల్లన్న, కెవిపిఎస్‌ రాష్ట్ర ఆధ్యక్షులు ఓ.నల్లప్ప, మాల మహానాడు రాష్ట్ర నాయకుడు ఓబిలేసు, అనంత హుక్కల వేదిక సొమర రాహూల్‌, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. శివారెడ్డి, బిఎంకెఎస్‌ కేశవరెడ్డి, తదితరులు మాట్లాడారు.

➡️