మహిళా డాన్సర్‌ అనుమానాస్పద మృతి

Oct 30,2024 07:18 #Crimes Against Women, #Vijayawada

ప్రజాశక్తి – విజయవాడ : ఈవెంట్ల బృందంతో కలిసి డాన్స్‌ చేసే ఓ మహిళ విజయవాడ ఆంధ్రప్రభ కాలనీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ సిఐ వెంకటేశ్వరనాయక్‌ కథనం ప్రకారం… కాకినాడ జిల్లా తురంగి ప్రాంతానికి చెందిన బంటుమల్లి వెంకటలక్ష్మి (36), విజయవాడ ఆంధ్రప్రభకాలనీకి చెందిన జ్యోతి, హైదరాబాద్‌కు చెందిన శ్రావణ్‌తోపాటు మరికొందరు ఈవెంట్లలో డాన్స్‌ చేస్తుంటారు. వెంకటలక్ష్మి కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లి, తిరిగి కాకినాడకు వస్తున్న క్రమంలో సోమవారం రాత్రి విజయవాడ ఆంధ్రప్రభకాలనీలోని జ్యోతి ఇంటికి వచ్చారు. వీరితో కలిసి ఈవెంట్స్‌ నిర్వహించే శ్రావణ్‌ కూడా జ్యోతి ఇంట్లో సోమవారం రాత్రి ఉండి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లిపోయారు. జ్యోతి నిద్ర నుంచి లేచి చూసే సరికి వెంకటలక్ష్మి ఉరి వేసుకొని ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల సమాచారం మేరకు మృతురాలి భర్త, ఆమె చెల్లెలు, ఇతర కుటుంబ సభ్యులు విజయవాడకు వచ్చారు. వారి వద్ద నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. హైదరాబాద్‌ వెళ్లిన శ్రావణ్‌ను పోలీసులు విజయవాడకు రప్పించి, విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.

➡️