అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

ప్రజాశక్తి-బత్తలపల్లి (శ్రీసత్యసాయి జిల్లా) : రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో అప్పుల బాధతో మంగళవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో మహిళా రైతు, అనకాపల్లి జిల్లాలో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు గ్రామానికి చెందిన శివలక్ష్మి (33) తనకున్న రెండు ఎకరాల పొలంలో వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నారు. పంటల సాగు నిమిత్తం సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. ఏటా పెట్టుబడులు పెట్టడమేగానీ దిగుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చడం కష్టమైంది. ఈ నేపథ్యంలో శివలక్ష్మి భర్త బత్తినన్న పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన రైతు మరిసా అప్పలనాయుడు (45) తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. పంటల సాగు, వ్యక్తిగత అవసరాల నిమిత్తం అప్పులు చేశారు. కొద్ది రోజులుగా అప్పులు తీర్చాలని రుణ దాతలు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక మనస్తాపంతో పురుగుల మందు తాగారు. కుటుంబీకులు ఆయనను వెంటనే అనకాపల్లిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️