కుమారుడితో కలిసి మహిళా హోంగార్డు ఆత్మహత్య

Feb 9,2025 21:01 #'suicides', #anakapalle district

ప్రజాశక్తి – అనకాపల్లి : భర్త వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి ఓ మహిళా హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణ సిఐ విజరు కుమార్‌ కథనం మేరకు.. కశింకోట మండలంలోని అట్టా వీధికి చెందిన అట్టా ఝాన్సీ (28) డిఎస్‌పి కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆమెను భర్త వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన ఆరేళ్ల కుమారునితో కలిసి ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఏలేరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. చివరిసారిగా అమెను ఏలేరు కాలువ వద్ద చూశామని స్థానికులు చెప్పడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఆదివారం తుమ్మపాల వద్ద వారికి మృతదేహాలు లభ్యమయ్యాయి. ట్రైనీ డిఎస్‌పి కృష్ణ చైతన్య, టౌన్‌ సిఐ టివి.విజయ్ కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎన్‌టిఆర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఝాన్సీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. 2012లో విజయ అచ్యుతరావుతో ఝాన్సీకి వివాహమైందని, అప్పటి నుంచి తరుచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ఆమెపై అనుమానంతో నిత్యం చేధించేవాడని కన్నీరుమున్నీరయ్యారు. కుమారుడిని కూడా సరిగ్గా చూసేవాడు కాదని తెలిపారు. పోలీసులు కూడా స్టేషన్‌కు పిలిపించి మందలించారని, అయినా ఆయన బుద్ధి మారలేదని అన్నారు.

➡️