అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్ ‘ తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీంతో నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలకు శనివారం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కు అవకాశం ఉందని, ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గంటకు 7 కిమీ వేగంతో ‘ఫెంగల్ ‘ తుపాన్ కదులుతున్నదని, ప్రస్తుతానికి పుదుచ్చేరికి 180 కి.మీ, చెన్నైకి 190 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.