- పని ఒరవడి, నిర్మాణ కృషిలో మార్పులు
- సిపిఎం రాష్ట్ర మహాసభలో రాజకీయ నిర్మాణ నివేదిక ప్రతిపాదన
ప్రజాశక్తి – కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్(నెల్లూరు) : రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పార్టీ స్వతంత్రంగాను, వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో ఉమ్మడిగానూ గత మూడేళ్లలో అనేక పోరాటాలు నిర్వహించినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు వివరించారు. శుక్రవారం నెల్లూరులోని కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్‌లో ప్రారంభమైన సిపిఎం రాష్ట్ర 27 వ మహాసభలో రాజకీయ నిర్మాణ నివేదికను ఆయన ప్రవేశపెట్టారు. ”క్షేత్రస్థాయి కృషి- క్షేత్రస్థాయి నాయకత్వం” నినాదంతో పని ఒరవడిని మార్చుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, వివిధ తరగతుల ప్రజలు చేసిన పోరాటాలకు సంఘీభావ ఉద్యమాలు చేపట్టామని వివరించారు. గిరిజన ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా, పోలవరం ప్రాజెక్టు పనుల విషయానికే పరిమితమై నిర్వాసితులకు పరిహారం, ఇతర సమస్యలను ప్రస్తావించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపైనా వివిధ రూపాల్లో ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రల ద్వారా గల్లీ నుండి ఢిల్లీ దాకా చర్చ పెట్టడం వల్లే ఇటీవల నిర్వాసితులకు పరిహారం ప్రకటించారని, అయితే ఇది సంతృప్తికరంగా లేదని చెప్పారు. జీవో నెంబరు 3 పునరుద్ధరణకు, గిరిజనులకు ప్రత్యేక డిఎస్‌సి కోసం ఏజెన్సీ బంద్ జయప్రదంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రత్యక్ష ఆందోళనలతో పాటు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికుల సమ్మె, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనలకు పార్టీ తరపున సంఘీభావం తెలిపినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ….కార్మిక సంఘాల ఆందోళనలను సమన్వయపరిచి ఈ కాలంలో ఉమ్మడిగానూ, విడిగా పోరాటాలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ప్రజారక్షణ భేరి ర్యాలీ, బహిరంగసభలకు, స్థానిక సమస్యలపై జనం కోసం సిపిఎం…కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందన్నారు.
వైసిపి మూడు రాజధానుల పేరిట గందరగోళం, అమరావతి ప్రాంత రైతుల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంపైనా పార్టీ ఆందోళన చేసినట్లు చెప్పారు. అమరావతి ఏకైక రాజధాని.. ప్రజారాజధానిగా ఉండాలన్నది సిపిఎం విధానమని చెప్పారు. టిడిపి కూటమి ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలు చేస్తుందని ప్రజలు భావించారనీ, కానీ ఆరేడు నెలలు గడిచినా తొలి సంతకం చేసిన డిఎస్‌సికే దిక్కులేకుండా పోయిందనీ చెప్పారు. జనసేన ఎన్నికల ముందు కంటే ఇప్పుడు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుతోందన్నారు.
బిజెపిని ఒంటరిపాటు చేయాలన్న సిపిఎం 23వ అఖిల భారత మహాసభల నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి కృషి జరిగిందని, అయితే రాష్ట్రంలో టిడిపి-జనసేన పార్టీలు… బిజెపితో అంటకాగడం, వైసిపి రాజీ వైఖరి అవలంభించాయని, ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోందని వివరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ రావడం కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల విజయమేనన్నారు.
అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికులు, స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటాల నేపథ్యంలో రాజకీయ కృషిని పెంచుకోవాల్సి ఉందని చెప్పారు. విజయవాడ వరదల సమయంలో పార్టీ, ప్రజాసంఘాల కృషి విశేషంగా ఉందని చెప్పారు. స్థానిక సమస్యలపై నిరాటంకంగా, నికరంగా కృషి చేయాలని చెప్పారు.
రాబోయే కాలంలో స్థానిక సమస్యలపై కృషి పెరగాల్సి ఉందని, దీనిపై రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వం చొరవ తీసుకోవాల్సి ఉందని వివరించారు. పార్టీ స్వతంత్ర శక్తిని పెంచుకుంటూ వామపక్ష ప్రజాతంత్ర శక్తుల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.