కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి

– లెనిన్‌ శత వర్ధంతి ఉత్సవాల సెమినార్‌లో వెంకట్రావు
ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ :కామ్రేడ్‌ లెనిన్‌ స్ఫూర్తితో కార్పొరేట్ల దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక, కర్షక పోరాటాలు ఉధృతం చేయాలని ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్‌ వెంకట్రావు కోరారు. లెనిన్‌ శత వర్ధంతి ఉత్సవాల సందర్భంగా సిపిఎం ఒంగోలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్‌లో ‘సమకాలిన పరిస్ధితులు- లెనిన్‌ సూత్రీకరణ’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకట్రావు మాట్లాడుతూ… ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక విధానాల ద్వారా కార్పొరేట్లు, పాలకులు ఒకటై దేశ సంపదను దోచుకుంటున్నారని వివరించారు. కార్పొరేట్లను అధికార బిజెపి పెంచి పోషిస్తోందని విమర్శించారు. బిజెపి పాలనలో అన్ని రకాల వ్యవస్థలూ ధ్వంసం అయ్యాయని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలను శాసించే స్థాయికి కార్పొరేట్‌ శక్తులు ఎదిగాయని చెప్పారు. మతోన్మాద విస్తరణే అజెండాగా కేంద్రం పనిచేస్తోందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసి కార్పొరేట్ల జపం చేస్తోందని విమర్శించారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతుందని వివరించారు. కార్మిక, కర్షక ఉద్యమాలను బలోపేతం చేయాలని, కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి.కొండారెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సిద్ధయ్య, జాలా అంజయ్య, ఒంగోలు నగర కార్యదర్శి జి.రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️