లేబర్‌ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం

  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు

ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్‌ : కార్మికులను కట్టు బానిసలను చేసే లేబర్‌ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నరసింగరావు కార్మికులకు పిలుపునిచ్చారు. సిఐటియు నాయకత్వ ప్రాంతీయ వర్క్‌ షాప్‌లో భాగంగా ఆదివారం రెండో రోజు సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం కార్మికులకు నష్టదాయకమైన కార్మిక చట్టాలను తీసుకురావడం దుర్మార్గమన్నారు. 29 రకాల కార్మిక చట్టాలను మార్పు చేస్తూ నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకురావడం అన్యాయమని తెలిపారు. కార్మికుడు యూనియన్‌ పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును ఈ లేబర్‌ కోడ్ల వల్ల హరించుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిక్స్డ్‌టర్మ్‌ ఎంప్లాయి పేరుతో కార్మిక హక్కులకు, సామాజిక భద్రత కోడ్‌తో పిఎఫ్‌, ఇఎస్‌ఐ లాంటి సౌకర్యాలకు కార్మికుడు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అఖిలభారత కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపును జయప్రదం చేయాలని కోరారు. సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులు మాట్లాడుతూ రాబోవు కాలంలో సిఐటియు నాయకత్వంలో నిర్వహించే కర్తవ్యాలను వివరించారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కడప జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి మనోహర్‌, నంద్యాల జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి నాగరాజు, సత్యసాయి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, సిఐటియు నగర నాయకులు సాయిబాబా, నరసింహులు, విజరు, మహమ్మద్‌ రఫీ, ఏసు, ప్రభాకర్‌, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️