- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి -ఉక్కునగరం (విశాఖపట్నం) విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయడంలేదని ప్రధాని మోడీ ప్రకటన చేసే వరకూ పోరాటం ఆగదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 1441వ రోజుకు చేరాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్‌ఫర్నేష్ విభాగానికి చెందిన ఐఎన్‌టియుసి కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ నాయకులు శ్రీనివాసరావు, బిఎన్.రాజు, రమణమూర్తి, డివి.రమణారెడ్డి, కారు రమణ మాట్లాడుతూ.. 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ ప్రకటించిన నాటికి రూ.940 కోట్ల నికర లాభాల్లో ఉన్న ప్లాంట్‌ను కేంద్రం నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం విధ్వంసకర ఆంక్షలతో 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 1.5 మిలియన్ టన్నులకు ఉత్పత్తి తగ్గిపోయిందని తెలిపారు. దీనివల్ల సుమారు రూ.11 వేల కోట్ల నష్టం వచ్చినట్లు పేర్కొన్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు సుమారు 750 మంది ఉద్యోగులు రాజీనామా చేశారని, కాంట్రాక్టు వ్యవధి పూర్తయిందని ఇప్పటికే వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను నిలిపివేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికారులతోపాటు వారి అనుయాయులుగా వ్యవహరించి భారీ అవినీతికి పాల్పడిన పలువురు అధికారులపై సిబిఐ దర్యాప్తు చేసి కంపెనీ ఆస్తులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతమైన యాజమాన్యాన్ని నియమిస్తే పూర్తిస్థాయి ఉత్పత్తి, లాభాల బాటలో నడిపించవచ్చని తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వేతనాలు ఇప్పించాలని కోరారు. కార్మికులను ఆర్థికంగా నష్టపరిచి, ఆందోళనకు గురిచేసి విఆర్‌ఎస్ వైపు నెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగింపు, పూర్వ వైభవం దిశగా ప్లాంట్‌ను నడిపిస్తామని టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, విధ్వంసాన్ని కొనసాగిస్తున్న తీరుకు పొంతనలేదన్నారు. కొందరు బిజెపి నేతలు ఉద్యమస్ఫూర్తిని, ఆంధ్రుల ఆకాంక్షను దెబ్బతీస్తూ మాట్లాడడం దుర్మార్గమన్నారు. కార్మిక సంఘాల నేతల పట్ల, పరిరక్షణ ఉద్యమం పట్ల అనుచితంగా మాట్లాడితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, రాపాటి కోటేశ్వరరావు, సిహెచ్.సన్యాసిరావు, పోతయ్యరెడ్డి, నగేష్, జి.సత్యారావు, అప్పలరెడ్డి, జగదీష్ కుమార్, పోలీస్ నాయుడు పాల్గొన్నారు.