CPM 27th Conference:హామీల అమలుకు ఉద్యమం

  • సిపిఎం నేతలు బాబూరావు, ప్రభాకర్‌రెడ్డి

ప్రజాశక్తి- కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు నుంచి) : ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించబోతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, కె ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులో సిపిఎం 27వ మహాసభను పురస్కరించుకుని రెండో రోజు ఆదివారం కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌లో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సిపిఎం మహాసభలో రెండొ రోజు ప్రతినిధులు చర్చించి పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలతోపాటు ఇతర హామీలనూ అమలు చేయాలని మహాసభ డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల కారణంగా తీవ్రమైన ఓటమిని చవిచూసిందన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, భారాలపై భారాలు మోపుతోందని వివరించారు. రాష్ట్ర ప్రజలు ఎనిమిది నెలలుగా ఓపికతో ఉన్నారని, హామీలను అమలు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉందని, ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయిందని ముఖ్యమంత్రి చెబుతున్నారని, రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వారు కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించాలని సూచించారు. టిడిపి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 50 వయసు నిండిన బిసిలకు పింఛన్లు, పట్టణవాసులకు ఆస్తి పన్నులు తగ్గించడం తదితర హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జూన్‌లో మూడు పథకాలు, ఆ తర్వాత మరో మూడు పథకాలు అమలు చేస్తామంటే కుదరదని, ఇచ్చిన హామీలపై కాలయాపన చేస్తే ప్రజలు ఊపేక్షించబోరని హెచ్చరించారు. మహాసభ అనంతరం ప్రజలను చైతన్యపరిచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సిపిఎం నేతృత్వంలో ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు. విజన్‌ 2047, వికసిత్‌ భారత్‌ తప్ప, 2025-26 గురించి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘చెప్పినవి చేయరు. చెప్పకుండా ప్రజలపై భారాల మోపుతారు. ఆ కోణంలోనివే విద్యుత్‌ ఛార్జీల బారాలు. భూముల రిజిస్ట్రేషన్‌ ధరల పెంపు’ అని వివరించారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచడం వల్ల పట్టణ ప్రాంతాల్లో అద్దెలు పెరిగి ప్రజలకు భారంగా మారుతుందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత పదిన్నర సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి ఏమి ఒరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్‌డిఎలో భాగస్వాములుగా ఉన్న టిడిపి, జనసేన పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ, కడప ఉక్కు, పోలవరం నిర్వాసితుల న్యాయమైన పరిహారం, ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు పూర్తికి ప్రధాని మోడీపై ఒత్తిడి చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంతవరకు సిపిఎం అవిశ్రాంత పోరాటం చేస్తుందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసి సాగునీరు అందించి రైతులకు మేలు చేయాలని డిమాండ్‌ చేశారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, నాయకులు మోహనరావు పాల్గొన్నారు.

➡️