కృష్ణాజలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాల ఎస్‌ఒసి దాఖలు

May 15,2024 22:49 #krishna, #water bord
  •  కౌంటర్లు వేసేందుకు నాలుగు వారాల గడువు
  •  జులై 15,16 తేదీల్లో మళ్లీ భేటీ
  •  కెడబ్యూడిటి-2 ఆదేశాలు

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో : కృష్ణాజలాల పున:పంపిణీ విషయంలో స్టేట్‌ ఆఫ్‌ కేస్‌(ఎస్‌ఒసి) దాఖలు చేసిన నేపథ్యంలో కౌంటర్లు వేయాలని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌-2 తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు వారాల గడువునిచ్చింది. మళ్లీ జులై 15, 16 తేదీల్లో ట్రిబ్యునల్‌ సమావేశమవుతుందని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్‌ సమావేశం కాగానే తొలుత ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. చైర్మన్‌ బ్రిజేష్‌కుమార్‌, సభ్యులు రామ్మోహన్‌రెడ్డి, తలపత్ర బుధవారం న్యూఢిల్లీలో సమావేశమై ఇరు రాష్ట్రాల వాదనలు విన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఒసి విషయంలో కౌంటర్లు దాఖలు చేయడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని ఎపి, తమకు రెండు వారాలు గడువు కావాలని తెలంగాణ కోరాయి. అలాగే కౌంటర్‌కు రిజాయిండర్‌ వేయడానికి సైతం ఎపి నాలుగు వారాలు, తెలంగాణ రెండు వారాల సమయం అడిగాయి. దీనికి ట్రిబ్యునల్‌ రెండు వారాల గడువును ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. అన్ని అంశాలపై డ్రాఫ్ట్‌ను జులై ఎనిమిదిలోపు సమర్పించాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. అలాగే కొత్త సాక్ష్యాలను ప్రవేశపెట్టాలనుకుంటే ముందే తెలియజేయాలని రెండు రాష్ట్రాలకు ట్రిబ్యునల్‌ సూచించింది. ఒకసారి ట్రిబ్యునల్‌ డ్రాఫ్ట్‌ అంశాలను ఖరారు చేశాక, ఆ మేరకే వాదనలు చేయాలని ఆదేశించింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఎపి అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️