– 2600 పేజీలతో జమ్మలమడుగు కోర్టుకు నివేదిక
ప్రజాశక్తి – పులివెందుల టౌన్ : మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కూతురు వైఎస్.సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, అప్పటి సిబిఐ విచారణ అధికారి రామ్‌సింగ్‌లు బెదిరించారని వివేకా పిఎ వెంకట కృష్ణారెడ్డి పెట్టిన కేసులో ఫైనల్ ఛార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు నివేదించారు. పులివెందుల మెజిస్ట్రేట్ సెలవులో ఉన్నందున జమ్మలమడుగు కోర్టులో గురువారం ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు పులివెందుల డిఎస్‌పి మురళీనాయక్ తెలిపారు.
వివేకా కూతురు వైఎస్.సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, అప్పటి సిబిఐ విచారణ అధికారి రామ్‌సింగ్‌లు బెదిరించారని 2023లో వెంకట కృష్ణారెడ్డి కోర్టులో ప్రయివేటు కేసు వేశారు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేయాలని పులివెందుల పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ ముగ్గురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని రామ్‌సింగ్, సునీత, రాజశేఖర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయడం సాధ్యం కాదని హైకోర్టు చెప్పడంతో వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును రీవెరిఫికేషన్ చేశారు. పలుమార్లు కృష్ణారెడ్డిని, సాక్షులను పోలీసులు విచారించి వారి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. గత నెల 20న పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. సాంకేతిక కారణాల వల్ల కోర్టు వెనక్కి పంపింది. ప్రస్తుతం జమ్మలమడుగు కోర్టుకు 2600 పేజీల ఫైనల్ ఛార్జిషీట్‌ను పోలీసులు సమర్పించారు. ఛార్జిషీట్‌లో 23 మంది సాక్షులను విచారించి వారు ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. వైసిపి నాయకుల బెదిరింపులతో సునీతా, రాజశేఖర్‌రెడ్డి, రామ్‌సింగ్‌పై కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని ఛార్జిషీట్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. పోలీసులు వేసిన ఛార్జిషీట్‌ను కోర్టు అంగీకరిస్తుందా? లేదా? అన్న విషయం వేచి చూడాల్సిందే.
