తిరుపతి జిల్లాలో గాలిలోకి కాల్పులు -పల్నాడులో రబ్బరు బుల్లెట్ల ప్రయోగం

May 14,2024 08:09 #palnadu, #Rubber bullets test

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టమూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టిడిపి, వైసిపి మధ్య పరస్పర దాడులు జరిగాయి. పలు పోలింగ్‌ బూత్‌ల్లో ఏజెంట్ల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దాడులను నివారించేందుకు నర్సరావుపేటలో పోలీసులు లాఠీఛార్జి చేసి రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘటన నేపథ్యంలో నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గృహనిర్బంధంలో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. తెనాలిలో ఓటరుపై దాడి చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. మాచర్లలో జరిగిన ఘర్షణలకు సంబంధించి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుడిని, టిడిపి అభ్యర్థి బ్రహ్మరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దాచేపల్లి మండలం తంగెడ, కేశానుపల్లి గ్రామాల్లో భారీగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి నాయకుడు కేశవరెడ్డి ఇంటిపై వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని సామగ్రి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పరుగులు పెడుతున్న టిడిపి కార్యకర్తలపై వైసిపి కార్యకర్తలు కార్లతో వెంటపడితొక్కించే ప్రయత్నం చేయడంతో ఇరువురు టిడిపి కార్యకర్తలకు కాళ్లు విరిగిపోయాయి. రెంటచింతల మండలం రెంటాలలో వైసిపి వారు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమిస్తున్నారనే ఆరోపణ నేపథ్యంలో టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మరెడ్డి అక్కడికి వెళ్లగా ఆయన వాహనాలపై వైసిపి వారు రాళ్లతో దాడులు చేశారు. పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. బ్రహ్మరెడ్డి అదే గ్రామంలో పోలింగ్‌ పరిశీలనకు వెళ్లగా మరోసారి ఆయన వాహనాలను వైసిపి వారు ధ్వంసం చేసి వాటికి నిప్పంటించడంతో అవి పూర్తిగా దగ్ధమైంది. రెంటచింతల మండలం పాల్వరు గేటు వద్ద ఎమ్మెల్యేపైనా, ఆయన అనుచరులపైనా రాళ్ల దాడి జరిగింది. కెపి గూడెంలో వైసిపి వారి దాడిలో కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టరు యరమల రామచంద్రారెడ్డి తలకు, చేతికి గాయాలయ్యాయి. వెల్ధుర్తి మండలంలో వైసిపి, టిడిపి వారి మధ్య ఘర్షణలో పోలీసులు, సెక్షార్‌ అధికారి గాయపడ్డారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో నాటు బాంబులు విసురుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓంశాంతినగర్‌, టైలర్స్‌ కాలనీలో మాజీ ఎమ్మెల్యేలు జెసి.ప్రభాకర్‌రెడ్డి, వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు ఒకేసారి చేరుకోవడంతో ఇరుగ్రూపులు పరస్పరం రాళ్ల రువ్వుకున్నాయి. ఈ దాడుల్లో పెద్దారెడ్డి కారు ధ్వంసమైంది. ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్‌పి అమిత్‌బర్దర్‌ తాడిపత్రికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఎస్‌పి వాహనంపై కూడా రాళ్లురువ్వారు. దీంతో, ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంలో టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బ్రాహ్మణపల్లి కాలనీలో ఘర్షణ పడిన టిడిపి, వైసిపి కార్యకర్తలను అదుపు చేయడానికి ఎన్నికల బందోబస్తులో ఉన్న సిఆర్‌పిఎఫ్‌ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిగారు. రావిళ్లవారిపల్లి, బ్రాహ్మణ కాలనీ దళితవాడ వారిని ఓట్లేయనీకుండా టిడిపి వారు అడ్డుకున్నారనేది వైసిపి వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఇరు గ్రూపుల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సదుం, సోమలలో టిడిపి ఏజెంట్లు ఐదుగురిని వైసిపి నాయకులు కిడ్నాప్‌ చేశారంటూ ఎస్‌ఐకు టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందన లేకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఏజెంట్లను అధికారులు వెతికి బూత్‌ల వద్దకు తీసుకొచ్చింది. ఎస్‌ఐ షేక్షావలిని ఇసి సస్పెండ్‌ చేసింది. సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం అన్నమేడు గ్రామంలో టిడిపి, వైసిపి గ్రూపుల మధ్య ఘర్షణను అదుపు చేయడానికి ఎస్‌ఐ గోపీనాథ్‌ వారిపై లాఠీఛార్జి చేశారు. ఆ సమయంలో ఇంటి బయట కూర్చుని ఉన్న వృద్ధురాలు ఎస్‌కె జులేఖాబికి లాఠీ తగలడంతో ఆమె తలపై బలమైన గాయమైంది. అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయిలో జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని వైసిపి నాయకులు కిడ్నాప్‌ చేయడంతో పోలింగ్‌ ఆగిపోయింది. ఈ క్రమంలో ఇవిఎంలను ధ్వంసం చేశారు. ఇక్కడ 11 గంటలకు తిరిగి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం కొండూరు పోలింగ్‌ బూత్‌ వద్ద మాజీ ఎమ్మెల్సీ బత్యాల కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలోని చిన్నగులవలూరులో వైసిపి నాయకుల దాడిలో టిడిపి ఏజెంట్లు ఉగ్ర నరసింహ, వినోద్‌లను తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం బేతంచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పిఎన్‌ బాబుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అనుచరుల దాడిలో బాబు కారు ధ్వంసమైంది. దీనిపై బాధితుడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ప్రకాశం జిల్లాలో కొందకు రెండు రౌండ్లు కాల్పులు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వైసిపి, టిడిపి గ్రూపులు రాళ్లు రువ్వుకోవడంతో వైసిపికి చెందిన కిలారి కృష్ణతోపాటు మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు గ్రూపులనూ చెదరగొట్టే క్రమంలో పోలింగ్‌ కేంద్రంలోనే రెండు రౌండ్లు కిందకు కాల్పులు జరిపారు. బుల్లెట్ల ధాటికి కింద పెచ్చులూడి టిడిపికి చెందిన బండారు కృష్టయ్యతోపాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
నలుగురు మృత్యువాత
వడదెబ్బతో ముగ్గురు, గుండెపోటుతో ఒకరు మొత్తం నలుగురు మృత్యువాత పడ్డాడు. ఓటు వేయడానికి వచ్చి క్యూలో ఉన్న ఇద్దరు, ఓటు వేశాక ఇంటికి వెళ్లాక ఒకరు మృతి చెందారు. వారిలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి గ్రామానికి చెందిన పాలూరి పెంటమ్మ (65), పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన హిజ్రా బిడ్డిక రాజారావు (55) ఉన్నారు. వీరు క్యూలైనులోనే ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన మండ్ల నరసింహుడు (70) ఓటు వేసి ఇంటికి వెళ్లాక మృతి చెందారు. గుండెపోటులో మరణించిన వారిలో భీమవరం మండలం యనమదుర్రు గ్రామపంచాయతీ డేగాపురం ప్రాంతానికి చెందిన పిల్లి సువర్ణరాజు (70) ఉన్నారు.

➡️