ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

  • 3.67 లక్షల క్యూసెక్కుల సముద్రం పాలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీకి 3,63,930 క్యూసెక్కుల నీరు వస్తుండగా 3,67,875 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్టు జలవనరుల శాఖ రిజర్‌ కన్జర్వేటర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు తెలిపారు. బ్యారేజీకి ఉన్న 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్‌, పులిచింతల నుంచి వరద ప్రవాహం వస్తుండడంతోపాటు భారీగా వర్షపాతం నమోదు కావడం వల్ల ప్రకాశం బ్యారేజీకి మరింత వరద పెరిగే అవకాశం ఉంది. గుంటూరు, ఎన్‌టిఆర్‌, కృష్ణా, బాపట్ల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరులశాఖ అధికారులు హెచ్చరించారు. ఆదివారం తెల్లవారుజామునకు వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చునని అంచనా వేశారు. వరద ఉధృతి నేపథ్యంలో బ్యారేజి ఎగువ, దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. సాగర్‌ జలాశయానికి 3.61 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. వచ్చిన నీటిని వచ్చినట్టు డ్యామ్‌కు ఉన్న 26 క్రష్ట్‌ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి పులిచింతలకు 3.08 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 3.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలో గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలుకాగా ప్రస్తుతం 38.36 టిఎంసిల నీరు నిల్వ ఉంది. పులిచింతల నుంచి వచ్చే నీటితో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.

➡️