ప్రజాశక్తి -నెల్లూరు : సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు బుధవారం సురక్షితంగా కృష్ణపట్నం పోర్టుకు చేరారని నెలురు జిల్లా కలెక్టరు ఒ ఆనంద్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు వేర్వేరుగా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జిల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు మూడ్రోజుల క్రితం మెకనైజడ్ బోట్‌లో వేటకు వెళ్లారు. మంగళవారం వాకాడు మండలం, దుగరాజపట్నం దగ్గర సముద్రంలో 14 కిలో మీటరల్ల దూరంలో ఇంజన్ పాడవడంతో బోటు ఆగిపోయింది. మత్స్యకారులు ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా చెప్పారు. వారు కలెక్టర్‌కు సమాచారం అందించడంతో నేవీ, కోస్ట్ గార్డు, మత్స్య శాఖ అధికారులు పెద్ద పడవల సహాయంతో మత్స్యకారులను సురక్షితంగా బుధవారం ఉదయం పది గంటలకు కష్ణపట్నం చేర్చారు. ఈ సందర్భంగా సదరు మత్స్యకారులు సిహెచ్ రమేష్, కె ఏడుకొండలు, కె చిట్టిబాబు, కె తిరుపతి, వి హరి బాబు, .వై అరవండి, కె వెంకట రమణయ్య, సిహెచ్ శివాజీ, ఎ తిరుపతి తమను కాపాడిన రాష్ట్ర ప్రభుత్వానికి, నెల్లూరు, తిరుపతి జిల్లా కలెక్టర్లకు, యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.