బాణసంచా కేంద్రంలో పేలుడు

  • 8 మంది దుర్మరణం 
  • మరో 8 మందికి తీవ్ర గాయాలు
  • అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం 
  • సిఎం చంద్రబాబు సహా పలువురు దిగ్భ్రాంతి

ప్రజాశక్తి- కోటవురట్ల (అనకాపల్లి జిల్లా), అమరావతి బ్యూరో : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామం వద్దగల బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కెజిహెచ్‌కు తరలించారు. బాణసంచా తయారీలో జువ్వలకు భారీగా ప్రెజర్‌ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో భీతావహ దృశ్యాలు కానవచ్చాయి. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి. ఈ ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. స్థానికుల కథనం ప్రకారం… కైలాసపట్నం గ్రామం వద్ద శ్రీలక్ష్మి ఫైర్‌ వర్క్స్‌ పేరిట బాణసంచా తయారీ కేంద్రం 30 ఏళ్లుగా నడుస్తోంది. సుమారు 30 మంది దీనిలో పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం వారంతా పనిలో నిమగమైన సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామస్తులు అప్పికొండ తాతబ్బాయి (50), పురం పాప (40), గుంపిన వేణుబాబు (40), రాజుపేటకు చెందిన సంక్రాంతి గోవింద (45), దాడి రామలక్ష్మి (38), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (50), విశాఖపట్నానికి చెందిన మనోహర్‌ (32), కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన దేవర నిర్మల (38) దుర్మరణం చెందారు. శ్రీలక్ష్మి ఫైర్‌ వర్క్స్‌ నిర్వాహకుడు మడగల జానకీరామ్‌, కార్మికులు జల్లూరి నాగరాజు, వెల్లంకి సంతోషి, వెల్లంకి సాహూ, వెల్లంగి రాజు, సింహాద్రి గోవింద, సేనాపతి శ్రీను, గుంపిన సూరిబాబు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కోటవురట్ల మండలం కైలాసపట్నం, కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందినవారు. వీరిని తొలుత నర్సీపట్నం ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కెజిహెచ్‌కు తరలించారు.

మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్ప్‌గ్రేషియా : మంత్రి అనిత

నర్సీపట్నం ఆస్పత్రిలో క్షతగాత్రులను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. కైలాసపట్నంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలను ప్రభుత్వపరంగా ఎక్స్‌గ్రేషియో కింద ఇస్తున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను అనకాపల్లి ఎంపి సిఎం.రమేష్‌, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తదితరులు పరామర్శించారు.

ప్రమాదంపై చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ దిగ్భ్రాంతి

ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు. ప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందని అధికారులను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

వైసిపి నాయకులు అండగా నిలవాలి : వైఎస్‌ జగన్‌

మృతుల, గాయపడిన వారి కుటుంబాలకు వైసిపి నాయకులు అండగా ఉండాలని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్ని రకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి : సిపిఎం

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనకాపల్లి జిల్లాలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నట్ల్టు పేర్కొన్నారు. బాణసంచా కేంద్రాల్లో లోపాలు ఉన్నచోట వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని, బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పేలుడు ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేసిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం విఫలమవుతోందని పేర్కొన్నారు.

➡️