ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : శాసనమండలికి ఇటీవల ఎంపికైన ఐదుగురు శాసనమండలి సభ్యులు సోమువీర్రాజు, బిటి నాయుడు, కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు), పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ భవనంలోని ఛైర్మన్ ఛాంబర్‌లో రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సభ్యులతో మండలి సభ్యులుగా బుధవారం ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఉప కార్యదర్శి రాజ్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సిఎంను కలిసిన నాగబాబు దంపతులు
ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం నాగబాబు ఆయన సతీమణి పద్మజతో కలిసి సిఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఎంను నాగబాబు శాలువాతో సత్కరించారు. అనంతరం నాగబాబును సిఎం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని నాగబాబుకు సిఎం బహూకరించారు.