నీట మునిగి ఐదుగురు యువకుల మృతి

  • ఇద్దరికి తప్పిన ప్రమాదం
  • తెలంగాణ సిద్దిపేట జిల్లాలో విషాదం
  • గజ ఈతగాళ్లతో మృతదేహాలు వెలికితీత

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం కొమురవెల్లి మల్లన్న దర్శానానికి వెళ్లిన యువకులు కొండపోచమ్మ సాగర్‌లో ఈతకు దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల కేంద్రంలోని కొండ పోచమ్మ సాగర్‌ వద్ద శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు.. గైరా ధనుష్‌ (18), గైరా లోహిత్‌(17) అన్నదమ్ములు, దినేశ్వర్‌ (17), సాహేల్‌ దిఫక్‌ సుతార్‌ (19), ఉప్పల జతీన్‌ (17), కొమారి మృగాంక్‌ ( 17) ఎండీ ఇబ్రహీం(20) శనివారం ఉదయం 8:30 గంటలకు సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని వస్తామని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి బయలు దేరారు. మార్గమధ్యలో తూంకుంట వద్ద టిఫిన్‌ చేసి మర్కుక్‌లోని కొండపోచమ్మ సాగర్‌ వద్దకు చేరుకొని ఈత కొట్టేందుకు ఏడుగురు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో సెల్పీలు దిగుతుండగా ఐదుగురు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. వారిలో గైరా ధనుష్‌, గైరా లోహిత్‌, దినేశ్వర్‌, సాహేల్‌ దిఫక్‌ సుతార్‌, ఉప్పల జతీన్‌ మృతిచెందారు. ప్రమాదం నుంచి బయటపడ్డ మృగాంక్‌, ఎండీ ఇబ్రహీం.. సాగర్‌ పరిసర ప్రాంతంలో ఉన్న రైతులకు సమాచారం చేరవేశారు.

వారు వచ్చేసరికి ఐదుగురు నీట మునిగారు. దాంతో పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లను రప్పించి యువకుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఏడు గంటల పాటు శ్రమించి ఐదు మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటన విషయం తెలుసుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు అదేశించారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, గజ్వేల్‌ బిఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌ రెడ్డి.. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.

➡️