- జీరో అవర్’లో ఎమ్మెల్యేలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ నియోజకవర్గాల్లోని వివిధ సమస్యలను శాసనసభ జీర్‌అవర్‌లో సోమవారం సభ్యులు ప్రస్తావించారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రైల్వే ట్రాక్‌లు దాటడానికి ఆర్‌ఓబిల నిర్మాణం చేపట్టాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. తన నియోజకవర్గంలో ఐదు చోట్ల వీటి నిర్మాణానికి ప్రతిపాదనలు రైల్వే శాఖకు పంపినట్లు తెలిపారు. వీటికి అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మొవ్వ డిగ్రీ కళాశాలలో అసంపూర్తిగా ఉన్న ఇండోర్ స్టేడియంను పూర్తి చేయాలని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రభుత్వాన్ని కోరారు. లాండ్ సీలింగ్ చట్టం వచ్చి 50 ఏళ్లయినా, ఇందుకు సంబంధించిన వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తహశీల్దారు కార్యాలయాలు, ఆర్డిఒ కార్యాలయం శిధిలావస్థకు చేరాయని ఎమ్మెల్యే బోజ్జల సుధీర్‌రెడ్డి తెలిపారు. సత్యవేడు నియోజకవర్గంలో మూడు చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. చిలకలూరిపేటలో మూడు వాగుల్లో గుర్రపుడెక్క వల్ల నీరు ప్రవహించే పరిస్థితి లేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రభుత్వాన్ని కోరారు.