విజయవాడ : కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవంను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవ మూర్తులను దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి హంస వాహనంపై ఉంచి పూజలు నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు చివరి రోజు ఆదివారం అమ్మవారు కృష్ణా నదిలో హంస వాహనంలో విహరిస్తారు. ఆనవాయితీగా జరిగే దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి బ్రేక్ పడింది. కఅష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు పై నుంచి సుమారు 40 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నదీ విహారం రద్దు చేసినట్లు అధికారుల తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తులకు కన్నుల పండువగా సాగే హంస వాహనం కృష్ణానది నీటి ప్రవాహంతో రద్దు కావడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు. దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా శ్రీ గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంలో ఉంచి మూడుసార్లు జలవిహారం చేయించడం ఆనవాయితీ. అందుకు అనుగుణంగా దేవాదాయ, జలవనరుల శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే వరద నీరు కారణంగా తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. నదీ విహారానికి అనుమతి లేనందున ఉత్సవ మూర్తులను దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి హంస వాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. వర్షం వచ్చి ఆటంకాలు ఎదురైతే మాత్రం మహామండపంలోని ఆరో అంతస్తులో పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద 25 గేట్లు ఎత్తివేత …
కఅష్ణా నదికి 40,616 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రస్తుతం వస్తుండడంతో ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద 25 గేట్లను అడుగు మేర పైకెత్తారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తెప్పోత్సవ నిర్వహణ సాధ్యపడడం లేదు. తెప్పోత్సవం కోసం ఇప్పటికే హంస వాహనాన్ని సిద్ధం చేశారు. దాన్ని దుర్గాఘాట్ వద్ద ఉంచినప్పటికీ నీటి ప్రవాహ స్థాయి ఎక్కువగా ఉండటంతో ఈ ఉత్సవాన్ని రద్దు చేశారు. కృష్ణానదికి ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోతేనే ఈ ఉత్సవ నిర్వహణకు జలవనరుల శాఖ అనుమతి ఇస్తుంది. ఒకేవేళ ఇన్‌ఫ్లో ఉంటే 10 వేల క్యూసెక్కులలోపు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే జలవనరుల శాఖ అనుమతి ఇవ్వదు.