- బిజెపి ఎమ్మెల్యే ఆది వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జెసి
ప్రజాశక్తి – కడప ప్రతినిధి : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్‌లోని ఫ్లైయాష్ తరలింపు వ్యవహారంపై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి మధ్య నువ్వానేనా అనే రీతిలో ఉద్రిక్తత నెలకొంది. మంగళ, బుధవారాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం కడప, అనంతపురం సరిహద్దు ప్రాంతమైన కొండాపురం మండలం సుగమంచిపల్లి రహదారి దగ్గర భారీగా పోలీసులను మోహరించింది. అటువైపు నుంచి ఎవరూ రాకుండా, ఆర్‌టిపిపికి చెందిన ప్రవేశ ద్వారం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే..20 ఏళ్ల కిందటి నుంచి ఐదారుగురు స్థానిక నాయకులకు బూడిదను తరలించుకునే అవకాశాన్ని ఆర్‌టిపిపి కల్పించింది. సిమెంట్ కంపెనీలు రూ.25 నుంచి రూ.30 చొప్పున టన్నుకు నిర్వాహకులకు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీరందరూ ఆరు, ఏడు లోడింగ్ యంత్రాల సహాయంతో కడప, అనంతపురం జిల్లాకు చెందిన సిమెంట్ కంపెనీలు, బ్రిక్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రతి రోజూ 200 లారీలు తరలించి సొమ్ము చేసుకునేవారు. కడప జిల్లా సిమెంటు పరిశ్రమలతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన ఆల్ట్రాటెక్, ఎసిసి సిమెంట్ పరిశ్రమలకు తరలించేవారు. సదరు సిమెంట్ పరిశ్రమలు ట్రాన్స్‌పోర్టర్లకు సుమారు రూ.80 లక్షలు బకాయి పెండింగ్‌లో ఉన్నట్లు, సదరు కంపెనీలు ట్రాన్స్‌పోర్టర్ల ద్వారా చెల్లింపులు చేసినట్లు సమాచారం. ట్రాన్స్‌పోర్టర్లు లోడింగ్ నిర్వాహకులకు బకాయి చెల్లించకపోవడంతో సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది.
దీంతో లోడింగ్‌ను ఆపేశారు. స్థానిక ఆర్‌టిపిపి నుంచి ఇతరులు బూడిదను తీసుకెళ్లడం ఏమిటని, తామే లారీలతో సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెప్పడంతో వ్యవహారం రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి చర్చలు నడిచినప్పటికీ కొలిక్కి రాకపోవడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. జెసి ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఏడు ట్రాన్స్‌పోర్టు లారీలను గేటు దగ్గర నిలిపేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లైయింది. స్థానిక బిజెపి ఎమ్మెల్యే ఆది చర్యకు ప్రతిచర్యగా తాడిపత్రి ప్రాంతాల నుంచి జమ్మలమడుగు ప్రాంతాలకు వస్తున్న ఇసుక లారీలను నిలిపేయడంతో వివాదం ముదిరింది. ఆర్‌టిపిపికి వస్తానని కడప ఎస్‌పికి జెసి లేఖ రాయడంతో మంగళ, బుధవారం ఎర్రగుంట్ల, కొండాపురం ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమలు చేశారు. ఎమ్మెల్యే ఆది, జెసి వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లినట్లు సమాచారం. పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎదుట ఇరుగ్రూపులు చర్చలకు కూర్చున్నట్లు సమాచారం.