- నేడు అమరావతికి రావాలని ఆది, జెసిలకు పిలుపు
ప్రజాశక్తి – కడప ప్రతినిధి : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండల పరిధిలోని రాయలసీమ ధర్మల్ పవర్‌ప్లాంట్ (ఆర్‌టిపిపి)కు చెందిన ఫ్లైయాష్ తరలింపు వివాదం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ఈ మేరకు సిఎంఒ కార్యాలయం నుంచి బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డికి పిలుపు వచ్చింది. శుక్రవారం అమరావతికి రావాలని కబురు పెట్టినట్టు సమాచారం. పనుల పంపకాలు చేస్తారా? లేక పాత కాంట్రాక్టు విధానాన్ని పాటించేలా తన పార్టీకి చెందిన జెసి ప్రభాకర్‌రెడ్డి వైపు సిఎం మొగ్గు చూపిస్తారా? అని వేచి చూడాలి. 2014-19 టిడిపి హయాంలో వైసిపి తరుపున ఎమ్మెల్యేగా గెలిచి, టిడిపిలోకి జంప్ చేసిన, ప్రస్తుత బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, అప్పటి మాజీ మంత్రి, ప్రస్తుత వైసిపి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మధ్య గండికోట పనుల్లో భాగంగా కొండాపురం-తాడిపత్రి రహదారి పనులు సహా ఇతర పనుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.