ప్రణాళిక శాఖలో కదలిక- గణాంకాల తయారీపై దృష్టి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :చంద్రబాబు అంటేనే … రకరకాల సర్వేలు, విశ్లేషణలు… పవర్‌ పాయింట్‌ ప్రెజేంటేషన్లు ! గంటల కొద్దీ ఆయన నిర్వహించే సమీక్షలకు ఆ గణాంకాలే కీలకం! క్షేత్రస్థాయి సమాచారంతో ఎప్పటికప్పుడు వాటిని ఆయనకు ప్రణాళిక శాఖ అందించేది! అటువంటి కీలకమైన శాఖకు గత ప్రభుత్వ హయంలో పని పెద్దగా లేకుండా పోయిది. తప్పనిసరి తంతులా చేసే ఒకటి, రెండు పనులకు తప్ప తమను ఉపయోగించుకోవడం లేదని ఆ శాఖ అధికారులే వాపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలిచి, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించనుండటంతో ఆ శాఖలో కదలిక ప్రారంభమైంది. కొంతకాలంగా పక్కన పడేసిన ఫైళ్ల బూజు దులిపే పనిలో అధికారులు నిమగమైనారు. చంద్రబాబు ఏ సమీక్ష పెడతారో, ఏ గణాంకాలు అడుగుతారో అన్న ఆందోళన ఆ శాఖ సిబ్బందిలో కనపడుతోంది. దీంతో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు, ఆ పార్టీ ప్రాధాన్యతలు అధ్యయనం చేసి దానికనుగుణంగా అవసరమైన సమాచారాన్ని సేకరించే పనిలో అధికారులు నిమగమైనారు. ఉదయం సమీక్షకు వివరాలు కావాలని, రాత్రి సమయాల్లో చెప్పడం, ప్రణాళిక శాఖ అధికారులు రాత్రంతా కష్టపడి ఈ వివరాలు సిద్ధంచేసి నివేదికలు అందించడం జరిగేది. ఈ శాఖ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని కూడా నియమించేవారు. అయితే ఈ శాఖ అప్పట్లో తయారు చేసిన కొన్ని నివేదికలే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయన్న అభిప్రాయం కూడా ఉంది. చంద్రబాబు మెప్పు పొందెందుకుగాను లేని వృద్ధిని చూపించారన్న విమర్శలున్నాయి.
వీటిపై దృష్టి…
చంద్రబాబు పేషీ నుండి ప్రత్యేకంగా ఎటువంటి ఆదేశాలు రాకపోయినప్పటికీ రాజధాని, విద్యాశాఖ, విద్యుత్‌, వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి తదితర అంశాలపై ప్రణాళిక శాఖ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

➡️