ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి : ప్రతిపక్షాలకు మంత్రి నాదెండ్ల సూచన

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు దృష్టిసారించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ హితవు పలికారు. గుంటూరు జనసేన కార్యాల యంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ… విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వైసిపి నాయకులు మీడియా సమావేశాలకు పరిమితం అయ్యారని, ప్రత్యక్షంగా ప్రజలకు ఆదుకోవడానికి ముందుకు రాలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడిదారులు వస్తున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అరతకుముందు గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో స్వర్ణాంద్ర విజన్‌ డాక్యుమెంట్‌ 2047పై భాగస్వామ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వృద్ధి రేటు 15 శాతం ఉండేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. అమరావతిలో ఉమ్మడి గుంటూరు జిల్లా వారికి ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రాజధాని అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. సమావేశంలో ఎంపి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మీ, ఎమ్మెల్సీలు కె.ఎస్‌.లక్ష్మణరావు, చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నశీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️