- కలెక్టర్లకు సూచించిన సిఎస్ నీరబ్ కుమార్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రజల నుంచి అధిక సంఖ్యలో వినతులు అందుతున్నాయని, వీటిలో ఎక్కువ మొత్తం పెండింగ్‌లో ఉండిపోతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. వినతుల పరిష్కారంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖలు సేవలు అందించే విధానాన్ని జిల్లా యంత్రాంగం ఎంతో మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ ఎంతో ముఖ్యమైన పాత్రను జిల్లా స్థాయిలో కలెక్టర్లు పోషించాల్సి ఉందన్నారు. అందుకు తగ్గట్టు క్రియాశీలకంగా కలెక్టర్లు పనిచేయాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కలెక్టర్లు అందరూ అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలను సాధించేందుకు, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఈ సదస్సు ఎంతగానో దోహదపడనుందని చెప్పారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో రూపొందించిన పలు పాలసీలపై కలెక్టర్లు సమగ్రమైన అవగాహన ఏర్పరచుకోవాలని, వాటిని విజయవంతంగా అమలు చేసే అంశంపై దృష్టి సారించాలని సూచించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనులు పున్ణప్రారంభమైనందున కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయా జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపైన దృష్టి పెట్టాలన్నారు.