గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

Feb 12,2024 17:27 #Food Poisoning, #Konaseema
Food poisoning in Gurukula school
  • 52 మందికి అస్వస్థత
  • ఎనిమిది మందిని ఏరియా ఆస్పత్రికి తరలింపు

ప్రజాశక్తి – రామచంద్రపురం (డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా):డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం సమీపం ఆదివారపుపేటలో డాక్టర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌తో 52 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్‌ గురైన ఎనిమిది మంది విద్యార్థులను రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి చికెన్‌తో భోజనం చేసిన 500 మంది విద్యార్థుల్లో 52 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన ప్రిన్సిపల్‌ వెంటనే వారికి వైద్య సాయం అందించారు. బర్ల ధనుష్‌, కుంచె రామచరణ్‌, కె.ప్రసాద్‌, కె.జారు, రెడ్డి సురేంద్ర, గుర్రాల కార్తీక్‌, చిట్టూరి సత్య ప్రసాద్‌, సింగలూరు దినేష్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి ప్రిన్సిపల్‌ తీసుకెళ్లారు. కలెక్టర్‌ ఆదేశాలతో గురుకులంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల గురించి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం కుదుటపడిందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

➡️