విదేశీ కంపెనీలు దేశ భద్రతకు ముప్పు

  • బీమాలో ఎఫ్‌డిఐ నిర్ణయాన్ని ఉపసంహరించకపోతే సమ్మెకు సిద్ధం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఐసి ఉద్యోగుల నిరసనలు

ప్రజాశక్తి-యంత్రాంగం : బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 74 నుంచి నూరు శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఎల్‌ఐసి ఉద్యోగులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఐసి కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు. ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసనలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నేతలు మాట్లాడుతూ.. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని నూరు శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారని, ఆ నిర్ణయం భారతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన మూలధన సమీకరణపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. విదేశీ కంపెనీలు దేశ భద్రతకు, ప్రజల సమాచార గోప్యతకు ముప్పు అని తెలిపారు. కేంద్రం వెంటనే ఎఫ్‌డిఐ పెంపును విరమించుకోవాలని, ఎల్‌ఐసిని బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో ఎఫ్‌డిఐని పెంచుతూ బీమా చట్ట సవరణ బిల్లు తీసుకువస్తే సమ్మెకైనా వెనుకాడబోమని హెచ్చరిం చారు. పాలసీ ప్రీమియాల మీద కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్‌టిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో, ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ గవర్నర్‌పేటలో ప్రదర్శనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ఎల్‌ఐసి ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎల్‌ఐసి కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. విజయగనం జిల్లా విజయనగరం, గరివిడి ఎల్‌ఐసి కార్యాలయాల వద్ద నేతలు నిరసన తెలిపారు. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్‌ బిఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో ధర్నా నిర్వహించారు. నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కడపలోని డివిజనల్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. విదేశీ ఇన్సూరెన్స్‌ కంపెనీలను నేరుగా ఆహ్వానించడంతో బీమారం గానికి, పాలసీదారులకు మేలు చేయదని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎల్‌ఐసి కార్యాలయం వద్ద బీమా ఉద్యోగులు ఏజెంట్లతో కలిసి ఆందోళన చేశారు.

➡️